ట్రంప్‌ వలస నిబంధనలు వెనక్కి

4 Feb, 2021 09:42 IST|Sakshi

మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ 

డాలర్‌ డ్రీమ్స్‌ నెరవేరడానికి బాటలు 

భారతీయుల కలలు నెరవేరే అవకాశాలు

వాషింగ్టన్‌: దేశ వలస విధానంలో సమూల మార్పులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి 3 కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్‌ సంతకాలుచేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ వలసదారులపై అమలు చేసిన అత్యంత కఠిన నిబంధనల్ని వెనక్కి తీసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసే దుర్మార్గమైన విధానాల్ని ట్రంప్‌ అనుసరించారని వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు బైడెన్‌ చెప్పారు. డాలర్‌ డ్రీమ్స్‌ కలలు తీరేలా, ముస్లింలపై నిషేధం ఎత్తివేసి దేశ సరిహద్దుల్లో సక్రమం పర్యవేక్షణ జరిగేలా వలస విధానం ఉంటుందన్నారు. వచ్చే 180 రోజుల్లో∙ప్రభుత్వ సంస్థల చేసే సిఫారసుల మేరకు జరిగే మార్పుల వల్ల అమెరికా పౌరసత్వం కావాలనుకునే భారతీయుల కలలు నెరవేరే అవకాశాలున్నాయి.  

ఆ మూడు ఉత్తర్వులు ఇవే.. ! 
 1. ట్రంప్‌ హయాంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయిన వలసదారుల కుటుంబాలను కలపడానికి హోంల్యాండ్‌ సెక్యూరిటీ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ మొదటి కార్యనిర్వాహక ఉత్తర్వుని జారీ చేశారు. విడిపోయిన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కలిపే కార్యక్రమాన్ని ఈ కమిటీ నిర్వహిస్తుంది. అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసల నివారణకు ట్రంప్‌ ప్రభుత్వం అనుసరించి, జీరో టాలరన్స్‌ విధానం వల్ల 5,500 కుటుంబాలు విడిపోయాయి. ఇప్పటికీ 600కిపైగా పిల్లల తల్లిదండ్రుల్ని గుర్తించలేకపోయారు.  

2. అమెరికాకు వలసలు పోటెత్తడానికి గల కారణాలను తెలుసుకొని వాటిని నివారించడం, మానవతా దృక్ఫథంతో శరణార్థుల్ని అక్కున చేర్చుకునే విధంగా వ్యూహాన్ని రచించడమే లక్ష్యంగా రెండో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఉత్తర మెక్సికోలో మానవీయ సంక్షోభానికి దారి తీసిన మైగ్రెంట్‌ ప్రొటెక్షన్‌ ప్రోటోకాల్‌ కార్యక్రమాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో హోంల్యాండ్‌ సెక్యూరిటీని ఆదేశించారు.  

3. ఇక మూడో కార్యనిర్వాహక ఉత్తర్వు స్వేచ్ఛాయుత చట్టబద్ధమైన విలస విధానానికి సంబంధించింది. ఇటీవల కాలంలో వలస విధానానికి సంబంధించిన నియంత్రణల్ని, విధానాలను ప్రభుత్వం సమూలంగా సమీక్షించడం కోసం మూడో ఉత్తర్వుపై సంతకం చేశారు. దేశంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించే గ్రీన్‌ కార్డు రాకుండా అడ్డుకునే పబ్లిక్‌ చార్జ్‌ నిబంధనల్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది. విదేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న వారు 40 లక్షల మందికిపైగా ఉన్నారు. వీరిలో భారతీయులే అధికం. ఈ కొత్త అమెరికన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఊతంగా ఉంటారని భావిస్తున్న బైడెన్‌ వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఉత్తర్వుల్ని తీసుకువచ్చారు.  

మరిన్ని వార్తలు