ఇవే బైడెన్‌ ప్రాథమ్యాలు..!

10 Nov, 2020 04:40 IST|Sakshi

కోవిడ్‌ నియంత్రణ, ఆర్థిక వృద్ధి, జాతి వివక్ష అంతం, వాతావరణ మార్పుపై పోరు

కొత్త అధ్యక్షుడి అధికార మార్పిడి బృందం వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికాను అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నిౖకైన కమల హ్యారిస్‌ పనిచేయాలనుకుంటున్నారని ఆయన బృందం వెల్లడించింది. కోవిడ్‌–19 నియంత్రణ, మళ్లీ అభివృద్ధి పట్టాల పైకి ఆర్థిక రంగం, వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల అంతం, వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం.. ఇవే బైడెన్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించింది. అధికార మార్పిడి విధుల్లో ఉన్న బైడెన్‌ బృందం ఈ విషయాన్ని తమ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది.

ఈ లక్ష్యాల సాధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సమగ్ర వ్యూహంతో ఈ లక్ష్యాలను సాధించాలని బైడెన్‌ భావిస్తున్నారని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా తలెత్తిన ప్రజారోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించడం తక్షణ విధిగా బైడెన్‌ భావిస్తున్నారని పేర్కొంది. వైరస్‌ వల్ల కుదేలైన కుటుంబాలను, చిన్న వ్యాపారాలను, బాధితులను, కోవిడ్‌–19పై పోరాడుతున్న యోధులను పరిరక్షించడానికి ప్రాథాన్యం ఇస్తున్నట్లు వివరించింది.   కరోనా నియంత్రణ తరువాత.. మంచి వేతనాలు లభించే లక్షలాది ఉద్యోగాల కల్పన బైడెన్‌ ప్రభుత్వ తదుపరి లక్ష్యమని తెలిపింది.

అత్యుత్తమ అమెరికాను నిర్మించే దిశగా దేశంలోని ఉద్యోగులకు, కార్మికులకు అవసరమైన అన్ని హక్కులు, సదుపాయాలను కల్పించాలని సంకల్పించినట్లు వెల్లడించింది. ఒకవైపు కరోనాను నియంత్రిస్తూనే, మరోవైపు, ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం జరిగేలా, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల తొలగింపు బైడెన్‌ ప్రభుత్వ మూడో లక్ష్యమని వివరించింది. అమెరికా సమాజంలో భాగమైన బ్లాక్స్, బ్రౌన్స్‌ సంక్షేమం, వారి అభివృద్ధి కేంద్రంగా ఆర్థిక వృద్ధి సాగాలనేది నూతన ప్రభుత్వ ఆలోచన అని పేర్కొంది. దేశంలోని అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేసింది.

బైడెన్‌కు ఇప్పుడే ‘విషెస్‌’ చెప్పం!
మాస్కో/బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన వెలువడేవరకు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలపకూడదని రష్యా, చైనా నిర్ణయించాయి. అమెరికా చట్టాలు, నిబంధనల ప్రకారం బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు స్పష్టమైన తరువాతే తాము స్పందిస్తామని తెలిపాయి. ఎన్నికలపై తలెత్తిన న్యాయ వివాదాలు పరిష్కారమై, ఫలితాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాతే బైడెన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అభినందిస్తారని సోమవారం రష్యా ప్రకటించింది. బైడెన్‌ విజయం అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలపని దేశాల్లో  చైనా, రష్యాతోపాటు  బ్రెజిల్, టర్కీ, మెక్సికో ఉన్నాయి.  అమెరికా అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ఎన్నిక కావడంపై చైనా అధికారికంగా స్పందించలేదు ఈ విషయంలో అంతర్జాతీయ సంప్రదాయాలను పాటిస్తామంది. అక్కడి మీడియా మాత్రం వారి ఎన్నికను నిర్ధారిస్తూ పలు విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించింది.

>
మరిన్ని వార్తలు