యుద్దంపై నాటోతో బైడెన్‌ కీలక భేటీ.. పోలాండ్‌ టూర్‌కు షెడ్యూల్‌ ఫిక్స్‌

21 Mar, 2022 15:42 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడి కొనసాగుతోంది. పుతిన్‌ దళాల దాడిలో ఉక్రెయిన్‌ అస్తవ్యస్తమైంది. బాంబుల దాడితో పలు నగరాలు ధ్వంసమయ్యాయి. భారీ ఆస్తి నష్టంతో పాలుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ క్రమంలో అగ‍్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఈ వారంలో యూరప్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

ఉక్రెయిన్​పై రష్యా దాడులు మొదలుపెట్టి దాదాపు నెల రోజులకు చేరుకోబోతోంది. ఈ సమయంలో జో బైడెన్ యూరప్‌ పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా బైడెన్‌.. బ్రస్సెల్స్‌ చేరుకొని అ‍క్కడ నాటో, యూరప్‌ మిత్ర దేశాలతో సమావేశం జరుపనున్నారు. అనంతరం ఉక్రెయిన్‌ సరిహద్దు దేశమైన పోలాండ్‌లో బైడెన్‌ పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దుబాతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్‌లో పరిస్థితులపై చర్చించనున్నట్టు సమాచారం. కాగా, ర‌ష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి అత్య‌ధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు పోలాండ్‌కు వ‌ల‌స వెళ్లారు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 20 ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థులు పోలాండ్‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఉక్రెయిన్‌లో బైడెన్‌ పర్యటన ఉండదని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, దాడుల నేపథ్యంలో బైడెన్‌.. రష్యా, పుతిన్‌పై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

అయితే, ఉక్రెయిన్​కు భద్రతాపరంగా, మానవతా పరంగా ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని అమెరికా స్పష్టం చేసింది. అంతకు ముందు ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం అందజేసింది. మరోవైపు.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పుతిన్‌తో చర్చలకు తాను సిద్ధమని, ఒకవేళ అవి గనుక విఫలం అయితే తదనంతర పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు