78వ వసంతంలోకి జో బైడెన్‌.. అనేక సవాళ్లు!

21 Nov, 2020 20:38 IST|Sakshi

బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిపై విమర్శలు గుప్పించిన ట్రంప్‌

రొనాల్డ్‌ రీగన్‌ రికార్డును అధిగమించిన బైడెన్‌

ఆనాడు విలియం హారిసన్‌ విషయంలోనే ఇదే చర్చ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్‌ శుక్రవారం 78వ వసంతంలో అడుగుపెట్టారు. తద్వారా అగ్రరాజ్య అధ్యక్షులలో అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన ప్రెసిడెంట్‌గా చరిత్రకెక్కనున్నారు. 1989లో 77 ఏళ్ల 349 రోజుల వయస్సులో శ్వేతసౌధాన్ని వీడిన మాజీ అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ రికార్డును ఆయన సవరించనున్నారు. కాగా తన పుట్టినరోజున డెలావర్‌లో సమయం గడిపిన బైడెన్‌.. డెమొక్రాట్లు.. హౌజ్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ, సెనేటర్‌ చక్‌ షూమర్‌తో భేటీ అయ్యారు. అధికార మార్పిడి గురించి వీరిరువురితో చర్చించారు. ఇక 306 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన జో బైడెన్‌.. అన్నీ సజావుగా సాగితే మరో రెండు నెలల్లో అగ్రరాజ్య అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం, నిరుద్యోగిత, పెరిగిన జాతి వివక్ష వంటి పలు సవాళ్లు ఆయనకు స్వాగతం పలకనున్నాయి. 

అయితే అత్యధిక వయసులో ఆయన ఎంత వరకు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలరన్న అంశంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆది నుంచి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఓటమిని అంగీకరించేందుకు సుముఖంగా లేని ఆయన, బైడెన్‌ అధికారం చేపట్టినా ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేరంటూ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ‌ ఇక ట్రంప్‌ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టిన జో బైడెన్‌.. విజయోత్సవ ప్రసంగంలో భాగంగా.. ‘విద్వేషాన్ని, విభజనను కోరుకోని, ఐక్యతను అభిలషించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నాను. దేశాన్ని రెడ్‌ స్టేట్స్‌(రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యత ఉన్న రాష్ట్రాలు), బ్లూ స్టేట్స్‌(డెమొక్రటిక్‌ పార్టీ ఆధిక్యత ఉన్న రాష్ట్రాలు)గా విభజించి చూసే నేతగా కాకుండా.. మొత్తం అమెరికాను ఐక్య అమెరికాగా పరిగణించే ‘యునైటెడ్‌ స్టేట్స్‌’కు అధ్యక్షుడిగా ఉంటాను’ అని దేశ పౌరులకు హామీ ఇచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చారు. అయినప్పటికీ ఆయనపై కొంతమంది విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.(చదవండి: బైడెన్‌ జీవితం.. ప్రేమ, పెళ్లి, అంతలోనే వరుస విషాదాలు..)

ఈ విషయం గురించి రుటర్స్‌ యూనివర్సిటీ పొలిటికల్‌ సైంటిస్టు రాస్‌ బేకర్‌ మాట్లాడుతూ.. ‘‘అధ్యక్ష పదవి చేపట్టే ముందే బైడెన్‌ ఆరోగ్యం గురించి ఆయన టీం అన్ని వివరాలు ప్రజలు తెలిసేలా చేయాలి. తాను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నానని, తన బాధ్యతను నిరాంటకంగా నెరవేర్చగలననే విశ్వాసాన్ని బైడెన్‌ సైతం అమెరికా పౌరులకు ఇవ్వగలగాలి. తద్వారా విమర్శకులకు సమాధానం చెప్పవచ్చు’’అని పేర్కొన్నారు. అదే విధంగా.. పరిస్థితులు సజావుగా సాగితే ఇబ్బంది లేదని, లేనిపక్షంలో తన బాధ్యతలను శక్తిమంతమైన వ్యక్తికి అందించాలనే ఉద్దేశంతోనే తనకన్నా 20 ఏళ్లు చిన్నవారైన కమలా హారిస్‌ను ఆయన రన్నింగ్‌మేట్‌గా ఎంచుకున్నట్లు అభిప్రాయపడ్డారు. ముఖ్య వ్యవహారాలన్నింటిలోనూ ఆమెను భాగం చేయడం ఇందుకు బలం చేకూరుస్తోందన్నారు. (చదవండి: బైడెన్‌ది ట్రంప్‌ మార్గమేనా!)

రెండుసార్లు తీవ్ర అనారోగ్యం
ఇక సెప్టెంబరు నాటి సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో బైడెన్‌ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లయితే తన ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలను పారదర్శకంగా ప్రజల ముందు పెడతానని వ్యాఖ్యానించారు. అన్నీ సజావుగా సాగి ట్రంప్‌ శ్వేతసౌధాన్ని వీడిన తరుణంలో బైడెన్‌ వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టడం లాంఛనమే అయిన నేపథ్యంలో, ప్రస్తుతం ఆయన వయసుకు సంబంధించిన అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో బైడెన్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ కెవిన్‌ ఓకానర్‌ విడుదల చేసిన నివేదిక తెరమీదకు వచ్చింది. ‘‘పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తారు. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా, స్టేట్‌ అండ్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా పూర్తిస్థాయిలో పనిచేస్తారు ’’అని ఆయన అందులో పేర్కొన్నారు. 

అయితే ఆయన హృదయ స్పందనలో తరచుగా వ్యత్యాసం చోటుచేసుకుందని, కానీ అందుకు ప్రత్యేకంగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు.కాగా 1988లో బైడెన్‌ రెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బ్రెయిన్‌కు సంబంధించి ఆయనకు మేజర్‌ ఆపరేషన్‌ జరిగింది. అంతేగాక 2003లో బైడెన్‌ గ్లాడ్‌బ్లాడర్‌ను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో, యాక్టివ్‌ ఏజింగ్‌పై సెప్టెంబరులో ప్రచురితమైన ఓ జర్నల్‌లో బైడెన్‌, ట్రంప్‌లను సూపర్‌ ఏజెర్స్‌గా అభివర్ణించిన పరిశోధకులు, వీరిద్దరిలో ఎవరు అధ్యక్ష పదవికి ఎన్నికైనా పదవీ కాలం పూర్తిచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

నిమోనియా సోకడంతో!
1841లో కూడా అధ్యక్షుడిగా ఎన్నికైన విలియం హారిసన్‌ వయసు గురించి కూడా ఇలాంటి ఒక చర్చ జరిగింది. అప్పటికి ఆయన వయస్సు 68 ఏళ్లు. అయితే అప్పటివరకు గల అధ్యక్షుల్లో ఆయనే అత్యధిక వయస్సు గలవారు. దీంతో ఆయన పదవీకాలం గురించి అనుమానాలు వ్యక్తమైన వేళ, తాను ఆరోగ్యంగా ఉన్నానని నిరూపించుకునేందకు కోటు, హాటు ధరించకుండానే విలియం సుదీర్ఘ ప్రసంగం చేశారు. అప్పటికే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిమోనియా బారిన పడి అధ్యక్ష పదవి చేపట్టే నెలరోజుల ముందే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. పదవి చేపట్టిన కొన్ని నెలల్లోనే ఆయన మరణించడం గమనార్హం. అయితే ఆయన మృతికి గల అసలు కారణాలు(అనారోగ్య) ఏమిటన్న విషయం నేటికీ జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

మరిన్ని వార్తలు