డర్టీ బాంబ్ ప్రయోగిస్తే క్షమించరాని తప్పు చేసినట్లే.. రష్యాను మరోసారి హెచ్చరించిన బైడెన్‌

26 Oct, 2022 13:38 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఆ దేశం ఉక్రెయిన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే క్షమించరాని తప్పిదం చేసినట్లే అని స్ఫష్టం చేశారు. శ్వేతసౌధంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

డర్టీ బాంబ్‌(అణు బాంబ్‌)పై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బైడెన్ ఈమేరకు స్పందించారు. అణుబాంబుల గురించి వస్తున్న వార్తలు నిజమో కాదో తనకు తెలియదని, ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా డర్టీ బాంబ్‌ను ప్రయోగిస్తే మాత్రం తీవ్ర తప్పిదం చేసినట్లేనని పేర్కొన్నారు.

ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ న్యూక్లియన్ ఎనర్జీ ఆపరేటర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే రష్యా మాత్రం ఉక్రెయినే డర్టీ బాంబ్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని ఆరోపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఖేర్‌సన్ ప్రాంతంలో దాడి చేయబోతుందని చెప్పింది. సొంతప్రజలపైనే అణుబాంబు ప్రయోగించి  దాన్ని తమపై తోసేందుకు కుట్ర చేస్తోందని పేర్కొంది. ఖేర్‌సన్ నుంచి తమ బలగాలను ఖాళీ చేయిస్తోంది. డర్టీ బాంబ్‌ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనే తేల్చుకుంటామంది.

మరోవైపు రష్యా ఆరోపణలను నాటో దేశాలు ఇప్పటికే ఖండించాయి. యుద్ధంలో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే రష్యా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నాయి.
చదవండి: డర్టీ బాంబ్‌ పంచాయితీ భద్రతా మండలికి!

మరిన్ని వార్తలు