యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సృష్టికర్త మెకఫీ ఇకలేరు

25 Jun, 2021 06:26 IST|Sakshi

మాడ్రిడ్‌: యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్‌ మెకఫీ(75) బుధవారం స్పెయిన్‌ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బార్సిలోనా నగర సమీపంలోని జైలులో తన గదిలో మెకఫీ నిర్జీవంగా కనిపించారు. ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. పన్నుల ఎగవేత కేసులో ఆయనను అమెరికాకు అప్పగించవచ్చని స్పెయిన్‌ నేషనల్‌ కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ కేసులో నేరం రుజువైతే మెకఫీకి 30 ఏళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అధికారులు చెప్పారు. మెకఫీ మృతిపై న్యాయ విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందులో మెకఫీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ 75 ఏళ్ల అమెరికా పౌరుడు, పన్నుల ఎగవేత కేసులో నిందితుడు అని పేర్కొన్నారు. అమెరికా పౌరుడైన జాన్‌ మెకఫీ క్రిప్టోకరెన్సీ ప్రమోటర్‌గానూ వ్యవహరించారు.  

మరిన్ని వార్తలు