అమెరికా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు భారీ షాక్‌

1 Apr, 2021 16:45 IST|Sakshi

ఉత్పత్తి లోపం.. 15 లక్షల వ్యాక్సిన్‌ డోసులు వృథా

వాషింగ్టన్‌: ఉత్పత్తి సమయంలో చోటు చేసుకున్న తప్పిదం కారణంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి దాదాపు 15 మిలియన్‌ డోసు‌లకు సరిపడా ఔషధ పదార్థాలు వృథా అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు వెల్లడించారు. అయితే కంపెనీ ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దిడమే కాక వ్యాక్సిన్‌ డెలివరీ టార్గెట్‌ని రీచ్‌ అయినట్లు వారు తెలిపారు.

ఈ సంఘటన బాల్టిమోర్‌లోని ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ ఇంక్ కేంద్రంలో చోటు చేసుకుంది. దీని వల్ల మే నాటికి దేశంలో పెద్దలందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలనే అధ్యక్షుడి ఆలోచనకు బ్రేక్‌ పడవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక తప్పిదం సంభవించిన యూనిట్‌ నుంచి ఒక్క డోసును కూడా బయటకు పంపలేదని తెలిసింది. కానీ దీని గురించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇక ఒక బ్యాచ్‌ ఔషధ పదార్థాలు క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్‌ అయినట్లు జాన్సన్‌ అండ్‌​ జాన్సన్‌ ఓ ప్రకటన చేసింది.

ప్లాంట్‌లో ఉత్పత్తి సమయంలో తలెత్తిన లోపం గురించి తొలుత న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. కార్మికులు అనుకోకుండా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌కు సంబంధించని ఔషధ పదార్థాలను ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ పదార్థలతో కలిపినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. దీని గురించి ఆస్ట్రాజెనికా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తప్పిదం అమెరికాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కోవిడ్‌ టీకా కార్యక్రమం కోసం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో పాటు ఫైజర్‌, మోడర్నా కంపెనీలు వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తున్నాయి. 

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మినహాయించి మిగతా రెండు కంపెనీలు 120 మిలియన్‌, 100 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌లను సరఫరా చేసి టార్గెట్‌ రీచ్‌ అయ్యాయి. ఈ తప్పిదం విషయాన్ని ఎమర్జెంట్‌తో పాటు ఫుడ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ)‌ అధికారులకు కూడా తెలిపామని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని ఎఫ్‌డీఏ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: నేపాల్‌ సైన్యానికి భారత్‌ అరుదైన బహుమతి

మరిన్ని వార్తలు