Delta Variant: జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌ టీకాతో చెక్‌..!

2 Jul, 2021 19:43 IST|Sakshi

న్యూజెర్సీ: కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైన డెల్టా వేరియంట్‌పై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. అతి వేగంగా కరోనా మహమ్మారిని వ్యాప్తి చేసే డేల్టా వేరియంట్‌పై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని ఓ లాబోరేటరీలో జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా సింగల్‌ డోసు.. డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుందని, వ్యాక్సిన్ ప్రభావం దాదాపు 8 నెలల పాటు ఉంటుందని, ఆతర్వాత మ‌రోసారి సింగిల్ బూస్ట‌ర్ డోస్ తీసుకుంటే సరిపోతుందని స్పష్టమైంది.

SARS-CoV-2 వేరియంట్లపై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, యాంటీ బాడీలు త్వరగా ఉత్పత్తి చేసి డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేస్తుందని రిపోర్టులో వెల్లడించారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా (B.1.351) వేరియంట్‌ కంటే డెల్టా వేరియంట్‌పై మరింత ప్రభావం చూపుతుందని అధ్యయనంలో స్పష్టమైంది. ఈ టీకా తీసుకున్న 85 శాతం మందిలో వైరస్‌ ప్రాణాంతకంగా మారకుండా ప్రభావం చూపుతుంది. తమ వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో మెరుగైన ఫలితాలు రాబట్టిందని జాన్సన్ అండ్ జాన్సన్ ఎండీ పాల్ స్టాఫెల్స్ తెలిపారు.

క్లినికల్ డేటా సమాచారం మేరకే సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ ప్రభావంపై ఓ అంచనాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ 8 నెలలపాటు కచ్చితంగా రక్షణ కల్పిస్తుందని శాస్త్రీయమైన ఆధారాలున్నాయని తెలిపారు. తమ వ్యాక్సిన్‌ డెల్టాతో పాటు మరికొన్ని కరోనా వేరియంట్లపై భారీ స్థాయిలో ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఈ సింగిల్ డోసు వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అమెరికాలో ఫిబ్రవరి 27న ఆమోదం లభించిందని, మార్చి 11న యూరోపియన్ కమిషన్ కండీషనల్ మార్కెటింగ్‌కు అనుమతి పొందిందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు