జైలులోనే వికీలీక్స్ ఫౌండర్ అసాంజే పెళ్లి 

23 Mar, 2022 19:46 IST|Sakshi

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన ప్రేయసి స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోబోతున్నారు. బుధవారం లండన్‌లోని హై-సెక్యూరిటీ జైలులో వీరు వివాహం చేసుకోబోతున్నారని వికీలీక్స్‌ మీడియా బృందం తెలిపింది. టాప్‌ బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ మోరిస్ వివాహ దుస్తులను, అసాంజే కోసం కిల్ట్‌ను డిజైన్ చేస్తున్నట్లు పేర్కొంది.

నవంబర్ 2021లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట వివాహం అసాంజే జైల్లో ఉన్న కారణంగా వాయిదా పడింది. చివరికి గవర్నర్, జైలు అధికారుల ప్రత్యేక అనుమతితో  జైలులోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జైలులో నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులతోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య విజిటింగ్‌ హవర్స్‌ సమయంలో ఈ వేడుక జరగనుంది.

వికీలీక్స్ ప్రకారం, వందలాది మంది అసాంజే మద్దతుదారులు ఈ కార్యక్రమానికి జైలు వెలుపల చేరుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా అసాంజే వికీలీక్స్ యూఎస్ మిలిటరీ రికార్డులు, దౌత్య అంశాల విడుదలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. అసాంజే 2019 నుంచి బెల్మార్ష్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో 7 సంవత్సరాలు ఉన్నారు.

రాయబార కార్యాలయంలో నివసిస్తున్న సమయంలోనే అసాంజే తన న్యాయవాది మోరిస్‌తో కలసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేస్తున్నప్పుడు మోరిస్ను కలిశారు. 2015 నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు.

మరిన్ని వార్తలు