జులై నెల చెమట్లు పట్టించింది.. ఆగష్టు అంతకు మించి?

14 Aug, 2021 07:44 IST|Sakshi

మబ్బు పట్టిన వాతావరణం ఉన్నా.. అధిక వేడి, ఉక్కపోతతో ‘ఇది అసలు వానాకాలమేనా?’ అనే అనుమానం చాలామందికి కలిగించింది జులై నెల. ఇక ఆగస్టు లోనూ ఇదే తీరు కొనసాగుతున్నా.. అక్కడక్కడ చిరు జల్లులు- ఓ మోస్తరు వానలు, ఎక్కడో దగ్గర భారీ వర్షాలు.. తప్పించి పెద్దగా సీజన్‌ ప్రభావం కనిపించడం లేదు. దీంతో ఈసారి ఆగష్టు నాటికే అధిక వర్షాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతాయన్న భారత వాతావరణ శాఖ జోస్యం తప్పినట్లే అయ్యింది!!. ఇక ఈ భూమ్మీద ఇప్పుటిదాకా నమోదుకానీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈసారే నమోదు అయ్యాయి మరి!.

యూఎస్‌ నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ ఎట్మాస్పియర్‌ అడ్మినిస్ట్రేషన్‍(ఎన్‌ఓఏఏ), యూరోపియన్‌ కాపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీసెస్‌, యూఎన్‌ క్లైమేట్‌ సైన్స్‌ రిపోర్ట్‌.. ఈ మూడూ కూడా స్వల్ఫ తేడాలతో జులై నెలను ‘హాటెస్ట్‌ మంత్‌’గా ప్రకటించాయి. గత వంద సంవత్సరాల్లో ఈ సీజన్‌లో ఈ జులైను ఉక్కపోత నెలగా అభివర్ణించాయి. సాధారణంగా పశ్చిమ దేశాల్లో ఈ సీజన్‌ సమ్మర్‌.. ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాకాల సీజన్‌ కొనసాగుతుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా వర్షాభావ ప్రాంతాల్లోనూ వాతావరణం ప్రజలకు ముచ్చెమటలు పోయిస్తోంది. వేడి ప్రభావంతో శీతల గాలుల ప్రభావమూ తగ్గడం ఈసారి విశేషం.


చదవండి: కలిసి కదిలితేనే భూరక్ష

‘‘ఇదో కొత్త రికార్డు. ఓవైపు అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు, కార్చిచ్చు ప్రమాదాలు.. మరోవైపు కుంభవృష్టితో వరదలు, భూతాపం-వాతావరణంలోని ప్రతికూల మార్పుల ప్రభావం వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అని ఎన్‌ఓఏఏ ప్రతినిధి స్పినార్డ్‌ వెల్లడించాడు. 142 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకుని ఈసారి రికార్డును లెక్కగట్టారు. సముద్ర ఉపరితల వాతావరణంపై 0.93 సెంటీగ్రేడ్‌ పెరుగుదల వల్ల 50 డిగ్రీల సెల్సియస్‌ కన్నా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈసారి జూన్‌ చివర్లోనూ చాలా దేశాల్లో(ఉదాహరణకు పాకిస్థాన్‌) నమోదు అయ్యాయని ఆయన వివరించాడు.   భూతాపోన్నతిని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టకపోతే 2040 కల్లా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్‌ పెరగడం తథ్యమని ఇప్పటికే ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌క్లైమేట్‌ చేంజ్‌ (ఐపీసీసీ) హెచ్చరికలు జారీ చేసింది కూడా. 

పర్యావరణ సంరక్షణను ప్రభుత్వాలు, సంబంధిత ఆర్గనైజేషన్లే నిర్వర్తించాలన్న రూల్‌ ఏం లేదు. సాధారణ పౌరులుగా బాధ్యతతో వ్యవహరిస్తే..  వాతావరణ ప్రతికూల మార్పులను కొంతలో కొంత తగ్గించవచ్చనేది పర్యావరణ నిపుణుల మాట.  

ఆహార వృథాను అరికట్టడం
కొంచెం కష్టంగా అనిపించినా.. పెట్రోల్, డీజిల్‌ వాడకాన్ని నెమ్మదిగా తగ్గించడం. 
అవసరమైతే ఇంధన వనరుల విషయంలో ప్రత్యామ్నాయాలకు జై కొట్టడం
ఎనర్జీ(ఇంట్లో కరెంట్‌) పొదుపుగా వాడడం
చెట్ల సంరక్షణ.. మొక్కల పెంపకం

మరిన్ని వార్తలు