కరోనా కల్లోలం: భారత్‌కు అమెరికా తీపికబురు..

26 Apr, 2021 12:56 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలు ఈ మహమ్మారి బారినపడ్డాయి. చాలా మంది ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, ఈ విపత్తు సమయంలో అనేక దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటూ తమ స్నేహభావాన్ని చాటుతున్నాయి. అయితే, కరోనా మొదటి దశలో అమెరికాలో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో​ భారత్‌, అమెరికాకు అండగా నిలిచింది.  కోవిడ్‌ను ఎదుర్కోవడానికి కావాలసిన మందులను సరఫరా చేసింది. ఆపద సమయంలో మేమున్నామని అమెరికాకు స్నేహ హస్తాన్ని అందించింది.

కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌లో భారత్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీ ముడిసరుకుల ఎగుమతిపై అమెరికా ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆపత్కాలంలో ఇండియాకు అండగా నిలవాలంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన జో బైడెన్‌ భారత్‌కు సాయం అందిస్తామని తెలిపారు. భారత్‌లో కరోనా కేసులు పెరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, అన్నివిధాలుగా చేయుతనివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్‌ చేశారు.

అదే విధంగా, భారత్‌లో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, పీపీఈ కిట్లు, ముడిసరుకు, అమిడ్‌ వ్యాక్సిన్‌లు , వెంటిలేటర్లు పంపనున్నట్లు పేర్కొన్నారు. కాగా, అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్‌కూడా భారత్‌కు తమ సహకారం ఉంటుందని ట్వీట్‌ చేసింది. ఇక ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పరస్పర సహకారం చేసుకోవడం, ఇరుదేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతానికి​ తోడ్పడుతుందంటూ, జో బైడెన్‌ నిర్ణయం పట్ల అమెరికా, భారత్‌ కు చెందిన పలువురు నాయకులు ట్వీటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా, ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారిపై కలిసి కట్టుగా పోరాడాలని పిలుపు నిచ్చారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు