ఎవరీ లీసా? ఇంతకీ ఏం జరిగింది? మిలియన్ల ట్వీట్లతో ఉప్పెన ఎందుకంటే..

6 Oct, 2021 13:38 IST|Sakshi

Justice For Lisa Twitter Trend: అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో నిరూపించే ఘటన ఇది. ఓ పాప్‌ సింగర్‌ కోసం కోట్ల మంది కదిలారు.  #justiceforlisa.. ఇప్పుడు ట్విటర్‌లో మోత మోగిపోతున్న హ్యాష్‌ట్యాగ్‌.  లీసా అనే యంగ్‌ ర్యాపర్‌కు న్యాయం చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ఓవైపు పాత ట్వీట్లు డిలీట్‌ చేస్తుంటే.. లక్షల కొద్దీ కొత్త ట్వీట్లు పుట్టుకొస్తుండడం విశేషం.  ఈ క్రమంలో ఇప్పటికే  ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు దాటిపోయాయి మరి!

దక్షిణ కొరియా పాప్‌ గ్రూప్‌ ‘బ్లాక్‌పింక్‌’కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ గ్రూప్‌లోని నలుగురు సింగర్స్‌లో లీసా మనోబల్‌(24) ఒకరు. ఆమె అసలు పేరు ప్రణ్‌ప్రియా మనోబల్‌. థాయ్‌లాండ్‌లో పుట్టి, పెరిగిన లీసా..  2010లో పదమూడేళ్ల వయసుకి వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లేబుల్‌లో చేరింది. ఆ తర్వాత దక్షిణ కొరియాకు మకాం మార్చేసి..  2016 నుంచి బ్లాక్‌పింక్‌లో సింగర్‌గా కొనసాగుతోంది. బ్లాక్‌పింక్‌లో స్టార్‌డమ్‌, వరల్డ్‌వైడ్‌ ఫ్యాన్‌ఫాలోయింగ్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌ల లిస్ట్‌.. ఇలా ఎందులో చూసుకున్నా ఈమెకే క్రేజ్‌ ఎక్కువ. అలాంటిది.. 

కొద్దికాలంగా బ్లాక్‌పింక్‌ ఈవెంట్లకు లీసా పూర్తిగా దూరంగా  ఉంటోంది. ఈమధ్య బివిల్‌గరి ఫ్యాషన్‌వీక్‌తో పాటు మరికొన్ని షోస్‌కు లీసాను వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రమోట్‌ చేయలేదు. మిగతా ముగ్గురు సింగర్స్‌ జీసూ, జెన్నీ, రోజ్‌లను మాత్రం ప్రతీదానికి అనుమతిస్తున్నారు. ఈ వ్యవహారంపై లీసా అభిమానుల నుంచి నిరసర వ్యక్తంకాగా..  స్పందించిన వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కరోనా నిబంధనల కారణంగానే లీసాను అనుమతించడం లేదంటూ వివరణ ఇచ్చుకుంది. దీంతో అగ్గిరాజుకుంది. 

లీసాకు మద్దతుగా ఆమె ఫ్యాన్స్‌.. #justiceforlisa, #YGLetLisaDoHerWork హ్యాష్‌ట్యాగ్‌లను నడిపిస్తున్నారు. స్వదేశం నుంచి ఫ్రాన్స్‌కు లీసాను రప్పించడం,  పారిస్‌ ఫ్యాషన్‌​ వీక్‌లో అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆమెకు జరిగిన అవమానంగా  భావిస్తున్నారు అభిమానులు. మిగతా సింగర్స్‌ విషయంలో లేని ఆంక్షలు, అభ్యంతరాలు.. లీసాకు మాత్రమే ఎందుకని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే గుర్రుగా ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.

అయితే  బివిల్‌గరి సీఈవో జీన్‌ క్రిస్టోఫె బాబిన్‌ స్పందిస్తూ..  కొవిడ్‌ నిబంధనలు, పైగా ఆమె(లీసా) సొంత ఏజెన్సీ సూచనల మేరకే లీసా దూరంగా ఉంటోందని వెల్లడించారు.

 

తెరపైకి రేసిజం!
ఇక ఈ వివాదంలోకి రేసిజం ప్రస్తావన తెస్తున్నారు కొందరు. దక్షిణ కొరియా వ్యాపారవేత్త, వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో వాంగ్‌బోక్‌యుంగ్‌ జాత్యాహంకారంతో లీసాను పక్కనపెట్టిందనేది వాళ్ల వాదన. లీసా థాయ్‌లాండ్‌ ర్యాపర్‌ కావడం వల్లే ఈ వివక్ష అని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో వాంగ్‌బోక్‌ మీద RIP పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తన షేర్లు పతనం కాకుండా ఉండేందుకు #justiceforlisa ట్వీట్లను డిలీట్‌ చేయిస్తోందన్న వాదన తెర మీదకు వచ్చింది. దీంతో లీసా ఫ్యాన్స్‌ మరింత రెచ్చిపోయి ట్వీట్లేస్తున్నారు. కేవలం మ్యూజిక్‌ కేటగిరీలోనే ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు రాగా, మొత్తంగా నాలుగు మిలియన్లకు పైనే లీసా మద్దతు ట్వీట్లు పోస్ట్‌ అయ్యి ఉంటాయని తెలుస్తోంది.

సింగిల్‌గా దుమ్మురేపింది
వైజీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కొద్దికాలంగా ఆమెకు పొసగడం లేదన్న వార్తలు సోషల్‌ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ ఊహాగానాల నడుమే ఆమె బ్లాక్‌పింక్‌ నుంచి బయటకు వచ్చేస్తుందంటూ కథనాలూ వెలువడ్డాయి. కానీ, లీసా ఇప్పటివరకు స్పందించింది లేదు.  ఇదిలా ఉండగానే సెప్టెంబర్‌లో లాలిసా పేరుతో సోలో ఆల్బమ్‌ రిలీజ్‌ చేసింది లీసా. సౌత్‌ కొరియాలో ఏడున్నర లక్షల కాపీలు అమ్ముడుపోయి.. రికార్డు సృష్టించాయి. అంతేకాదు యూట్యూబ్‌ ఒక్కరోజులో 76.3 మిలియన్‌ల వ్యూస్‌ రాబట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్న క్రమంలో ఆమె ఇంకా బ్లాక్‌పింక్‌లోనే కొనసాగుతుందా? లేకపోతే బయటకు వచ్చేస్తుందా? అనేది చూడాలి.

మరిన్ని వార్తలు