Kabul Airport Attack: వేట తప్పదన్న బైడెన్‌.. దాడిని ఖండించిన తాలిబన్లు

27 Aug, 2021 08:00 IST|Sakshi

Kabul Airport Blast: కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సహకారంతో  అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్‌ ఖోరసాన్‌(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనల్లో 60 మంది చనిపోగా(70 నుంచి 90 మధ్య అంచనా).. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భావోద్వేగంగా ప్రసంగించారు. 

గురువారం వైట్‌ హౌజ్‌ ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ.. ‘‘బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. వాళ్లెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంతతేలికగా మేం మరిచిపోం. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐసిస్‌ నాయకుల ఏరివేత ఇక మొదలైనట్లే’’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. అఫ్గన్‌ గడ్డపై అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన.. మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్‌.. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు.

అయితే ఈ దాడి తరలింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అనుకున్న గడువులోపు(ఆగస్టు 31) తాలిబన్ల సహకారంతో సైన్యం-పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న మాటను కట్టుబడి ఉన్నామని బైడెన్‌ స్పష్టం చేశారు. తాము శాంతిని కొరుకుంటున్నామని  ప్రకటించుకున్న తాలిబన్లు(ది ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌).. పౌరులను లక్క్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం పహారా కాస్తున్న ప్రాంతంలోనే దాడి జరిగిందంటూ తాలిబన్‌ ప్రతినిధి ఒకరు ట్విటర్‌ ద్వారా ప్రకటన విడుదల చేశాడు. 

చదవండి: కాబూల్‌ విమానాశ్రయం: మారణహోమం ఇలా..

ఇదిలా ఉంటే ఉగ్రవాదుల నిఘాలో ఉన్నట్లు బైడెన్‌ ప్రకటించిన కొన్ని గంటలకే కాబూల్‌ హమీద్‌ కర్జాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ అబ్బే గేట్‌ వద్ద ఓ బాంబు పేలుడు, బారోన్‌ హోటల్‌ వద్ద మరో పేలుడు జరగడం విశేషం. అమెరికన్లను లక్క్ష్యంగా చేసుకుని ఐసిస్‌ ఖోరసాన్‌(కె)ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. సూసైడ్‌ బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పెంటగాన్‌ వర్గాలు ప్రకటించాయి. క్లిక్‌ చేయండి: టార్గెట్‌లో ఉన్నారు.. జాగ్రత్త: బైడెన్‌

చిన్నపిల్లలు, అఫ్గన్‌ పౌరులు, తాలిబన్‌ గార్డులు ఘటనల్లో గాయపడినట్లు తెలుస్తోంది. ఆ జంట పేలుళ్లలో 13 మంది అమెరికన్‌ సైనికులు చనిపోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి తర్వాత పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించిన బైడెన్‌.. తరలింపు ప్రక్రియ కొనసాగునుందని ప్రకటించారు. ఇప్పటికే లక్ష మందికి పైగా అఫ్గన్‌లను(వాళ్లలో ఐదువేల మంది అమెరికన్లు), మరో వెయ్యి మందిని తరలిస్తే ఆపరేషన్‌ పూర్తైనట్లేనని అమెరికా రక్షణ దళ  జనరల్‌ మెక్‌కెంజీ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు