కాబూల్ పేలుళ్లు: తాలిబన్ల బెట్టు.. నరమేధం నుంచి బతికి బయటపడ్డ 160 మంది

27 Aug, 2021 10:10 IST|Sakshi

జంట పేలుళ్లతో కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ రక్తసిక్తంగా మారింది. అమెరికా భద్రతా దళాలను టార్గెట్‌గా చేసుకుని ఐసిస్‌ ఖోరసాన్‌(కె) సంస్థ చేపట్టిన నరమేధంలో అఫ్గన్‌ పౌరులు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి 160 మంది అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. 

తాలిబన్ల దురాక్రమణ తర్వాత పెద్ద ఎత్తున్న పౌరులు పారిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీలు, మహిళలు భద్రత విషయంలో భయాందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో అఫ్గన్‌ సంతతికి చెందిన సుమారు 160 మంది మైనార్టీలు బుధవారం సాయంత్రం కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వీళ్లలో 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు ఉన్నారు. అక్కడి నుంచి బయటి దేశాలకు వెళ్లాలన్నది వాళ్ల ఉద్దేశం. అయితే తాలిబన్లు గార్డులు వీళ్లను అడ్డుకున్నారు. సరైన పేపర్లు ఉన్నా.. తమను అడ్డుకున్నారంటూ వాళ్లంతా కాసేపు ధర్నా దిగారు కూడా. ఎంతసేపు ఎదురుచూసినా అనుమతించబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి వాళ్లంతా వెనుదిరిగారు. అయితే వాళ్లు ఏ ప్రదేశంలో అయితే కొద్దిగంటలపాటు ఎదురుచూశారో.. సరిగ్గా అదే ప్రదేశంలో(అబ్బే ఎంట్రన్స్‌ దగ్గర) ఆత్మాహుతి దాడి జరిగింది. 

‘‘ముందురోజు ఎక్కడైతే మేం ఎదురుచూశామో.. అక్కడే ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని తెలిసి వణికిపోయాం. అదృష్టం బావుండి అక్కడి నుంచి మేం వెళ్లిపోయాం. దాడిని తల్చుకుంటే బాధగా ఉంది. ప్రస్తుతం మా బృందం సురక్షితంగా ఉన్నాం. కార్టే పార్వాన్‌లోని గురుద్వారలో ఆశ్రయం పొందుతున్నాం’’ అని కాబూల్‌ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్‌​ గుర్మాన్‌ సింగ్‌ తెలిపారు. వాళ్లు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మంజిందర్‌ సింగ్‌ సిస్రా సైతం దృవీకరించారు. వీళ్లను సురక్షితంగా దేశం దాటించే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నట్లు బ్రిటన్‌ విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు.

చదవండి: అఫ్గన్‌​ ఎకానమీ.. ఘోరమైన సమస్యలు

హాట్‌ న్యూస్‌: కాబూల్‌ దాడి.. మూల్యం చెల్లించకతప్పదు

మరిన్ని వార్తలు