కమలా హ్యారిస్‌, మహిళలకిచ్చిన సలహా ఏంటంటే..

2 Nov, 2020 11:55 IST|Sakshi

వాటికి నో చెప్పడమే నా బ్రేక్‌ఫాస్ట్‌ : కమలా హ్యారిస్‌

మహిళలు నాయకత్వ స్థానాల్లోకి వచ్చేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు!

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష రేసులో దూసుకుపోతున్న, కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్‌ (55) మహిళ సాధికారితపై కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏదైనా సాధించాలనుకున్నపుడు, ఇతరుల మాటలను పట్టించుకోకుండా..గమ్యంవైపు సాగిపోవాలని సూచించారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లతో ముచ్చటించిన ఆమెను మహిళలకు ఏం సలహా ఇస్తారని ప్రశ్నించినపుడు  ఈ సూచన చేశారు. (హోరాహోరీ పోరులో ‘పెద్దన్న’ ఎవరో?!)

‘మీరు ఏదైనా సాధించాలని ప్రయత్నించినపుడు, ప్రతికూలంగా వచ్చే సలహాలను, నిరుత్సాహ పరిచేమాటలను పట్టించుకోకండి.. నాయకత్వ స్థానంలో ఉండాలని భావిస్తే.. దూసుకు పోవడమే.. దానికి ఎవరినీ అనుమతి అడగవలసిన అవసరం లేదు’ అని కమలా హ్యారిస్‌​ సలహా  ఇచ్చారు. తన కెరియర్‌లో కూడా అది నీ పనికాదు, ఇది సమయం కాదు లాంటి  ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయనీ, కానీ  అవన్నీ తాను పట్టించుకోలేదన్నారు.  అలాంటి వాటికి నో చెప్పడమే తన అల్పాహారమని, అదే తన బలమని చెప్పుకొచ్చారు. తన అభిమాన భారతీయ వంటకాలు ఏమిటని ప్రశ్నించినపుడు దక్షిణ భారతదేశానికి సంబంధించి మంచి సాంబారు ఇడ్లీ ఇష్టమని ఆమె చెప్పారు. అదే నార్త్‌ ఇండియన్‌​ అయితే  టిక్కా ఇష్టమని చెప్పారు. ప్రచారంలో తన మానసిక ఆరోగ్యం కోసం ప్రతీరోజు ఉదయం వ్యాయామం చేస్తూ.. పిల్లలతో సమయాన్ని గడుపుతానన్నారు. అలాగే వంట చేయడాన్ని కూడా ఇష్టపడతానన్నారు.  దీంతోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉద్యోగాలు కల్పన తదితర అంశాలపైకూడా ఆమె సమాధానాలిచ్చారు.
 
కాగా ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ విజయం సాధించినట్లయితే ఉపాధ్యక్ష పదవిని అలంకరించే తొలి మహిళగా, తొలి శ్వేత జాతీయేతర మహిళగా  కమలా హారిస్‌ నూతన అధ్యాయం లిఖించే అవకాశం ఉంది. రేపు (నవంబర్ 3 న) జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (74), ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్,  డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్(77),  ఉపాధ్యక్ష పదవికి హ్యారిస్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు