Russia Ukraine War: కమలా హారిస్‌ కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌కు భారీ సాయం

11 Mar, 2022 09:26 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా సైన్యం బాంబు దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. బాంబులు, మిస్సైల్‌ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో పెద్ద పెద్ద భవనాలు నేల మట్టం అయ్యాయి. దీంతో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

మరోవైపు యుద్దం వల్ల భారీగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు అన్ని దేశాలు తమ వంతు సాయం అందిస్తున్నాయి. ఇప్పటికే రొమేనియా ఆర్థిక సాయంతో పాటుగా వివిధ రక్షణ పరికరాలను అందించింది. బెల్జియం, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రీస్‌, పోర్చుగల్‌, స్పెయిన్‌, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, యూకే వంటి దేశాలు ఫైటర్‌ జెట్స్‌, యుద్ధ సామాగ్రిని ఉక్రెయిన్‌కు అందించాయి. తాజాగా అమెరికా మరో ఉక్రెయిన్‌కు మరోసారి భారీ సాయం అందించనున్నట్టు కీలక ప్రకటన చేసింది. రష్యా సైనిక దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్​కు ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం ద్వారా 50 మిలియన్​ డాలర్లను మానవతా సాయం కింద అందిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ ప్రకటించారు.
 
మరోవైపు.. రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఉక్రెయిన్​పై దాడుల నేపథ్యంలో రష్యాపై వివాదస్పద పోస్టుల నియంత్రణపై ఆంక్షలను సడలించింది ఫేస్​బుక్​. రష్యాకు వ్యతిరేకంగా చేసే పోస్టుల్లో ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, పౌరులకు సామాన్య ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు అనుమతించబోమని వెల్లడించింది.

మరిన్ని వార్తలు