కమల మీడియా కార్యదర్శిగా సబ్రినా సింగ్‌

17 Aug, 2020 14:14 IST|Sakshi

వాషింగ్టన్‌: డెమొక్రాట్ల తరపున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమాలా హ్యారిస్‌ ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన కమల తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మీడియా కార్యదర్శిగా ఇండో-అమెరికన్‌ సంతతికి చెందిన సబ్రినా సింగ్‌ (32)ను నియమించుకున్నారు. సబ్రినా గతంలో ఇద్దరు డెమొక్రటిక్‌ పార్టీ ప్రెసిడెన్షిల్‌ అభ్యర్థుల వద్ద అధికార ప్రతినిధిగా పనిచేశారు. 

న్యూజెర్సీ సెనేటర్‌ కోరీ బుకర్‌, న్యూయార్క్‌ మాజీ మేయర్‌ మైక్‌ బ్లూమింగ్‌ వద్ద ఆమె పనిచేశారు. కాగా, డెమొక్రటిక్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. ఆమె తండ్రి డొనాల్డ్‌ హ్యారిస్‌ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్‌ ఇండియన్‌(చెన్నై).
(కమలా గెలిచినట్టే.. తమిళనాడులో వెలసిన పోస్టర్లు)

మరిన్ని వార్తలు