కమల దరహాసం

9 Nov, 2020 04:15 IST|Sakshi

వాషింగ్టన్‌: అదో అరుదైన దృశ్యం.. చరిత్ర సృష్టించిన అపురూపమైన సందర్భం. అగ్రరాజ్యానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి నల్లజాతీయురాలు, తొలి ప్రవాస భారతీయురాలు ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్న కమలా హ్యారిస్‌ జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు వెన్నెల కాంతులతో పోటీ పడే తెల్ల రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. మహిళా హక్కుల కోసం ఉద్యమించడమే తన లక్ష్యమని చెప్పడానికే ఆ రంగు దుస్తులు వేసుకున్నారు. అమెరికాలో 1913లో ఏర్పాటైన రాజకీయ సంస్థ ది నేషనల్‌ వుమెన్‌ పార్టీ తెలుపు, వంగపండు, బంగారం రంగుల్ని మహిళా ఉద్యమానికి ప్రతీకగా ఎంచుకుంది. అందులో తెలుపురంగు స్వచ్ఛతకి ప్రతిబింబంగా నిలుస్తుంది. అలా తెల్లరంగులో రాజహంసలా ఈ దేశానికి తాను తొలి మహిళా అధ్యక్షురాలిని అని, కానీ తాను చివరి మహిళని కాదు అంటూ ఉద్వేగ భరిత ప్రసంగాన్ని చేశారు.

స్ఫూర్తిని నింపే వీడియో
అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ ఇటీవల తన మేనకోడలిని ఒళ్లో కూర్చోబెట్టుకొని ముచ్చటించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నాలుగేళ్ల చిన్నారి అమరా అజాగు తనకు అమెరికాకు అధ్యక్షురాలు కావాలని చెప్పింది. దానికి కమల నువ్వు కూడా అధ్యక్షురాలివి కావొచ్చని అయితే దానికి చాలా కష్టపడాలని, 35 సంవత్సరాలు నిండాలని చెప్పి ఆ చిన్నారిలో స్ఫూర్తిని నింపారు. అదే స్ఫూర్తిని కమల తనలో తాను చాలా ఏళ్లుగా నింపుకుంటూ వస్తున్నారు. ఆ కష్టపడే తత్వం, తల్లి చెప్పిన మాటల్ని జీవితంలో తుచ తప్పకుండా ఆచరించడం, అంతులేని ఆత్మవిశ్వాసం ఆమెని ఉపాధ్యక్ష పీఠానికి దగ్గర చేశాయి.

నల్ల జాతీయురాలినని చెప్పడానికి గర్వపడతా
కమల తండ్రి డేవిడ్‌ హ్యారిస్‌ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్‌ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్‌ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి సంరక్షణలోనే పెరిగారు. ఆమె గుణాలు పుణికిపుచ్చుకొని జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, అద్భుతమైన నాయకత్వ లక్షణాల్ని సొంతం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని నల్లజాతివారిగానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే నన్ను, మా చెల్లెల్ని ఆత్మవిశ్వాసంతో పెంచారు. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్‌ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్‌ వి హోల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్‌ డగ్లస్‌ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిని సొంత పిల్లల్లా పెంచారు.

సమర్థవంతమైన నాయకురాలు
న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని డిస్ట్రిక్ట్‌ అటార్నీగా. రాష్ట్ర అటార్నీ జనరల్‌గా తన సత్తా చాటారు. అద్భుతమైన వాక్పటిమతో మంచి లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2016లో డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున సెనేట్‌కి ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత అమెరికాకి అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తో పోటీ పడి గత ఏడాది చివర్లో రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడెన్‌కు మద్దతుగా నిలిచి ఉపాధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు. ఒక సెనేటర్‌గా ఆమెలో నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి ఎప్పుడో తెలిశాయి. ఇంటెలిజెన్స్, జ్యుడీషియరీ విభాగాల్లో మంచి పట్టున్న ఆమెకు మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం ఉంది.

నా ఫోన్‌ రింగ్‌ ఆగలేదు
అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై కమలా హ్యారిస్‌ చరిత్ర తిరగరాయడంతో భారత్‌లోని ఆమె స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఢిల్లీలో ఉంటున్న ఆమె మేనమామ గోపాలన్‌ బాలచంద్రన్‌ కమల విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కమల విజయం సాధించిన దగ్గర్నుంచి తన ఫోన్‌ రింగ్‌ అవుతూనే ఉందని ఆయన చెప్పారు.
 
తొలి మహిళనే కానీ...
మీరు ఆశను, ఐక్యతను, మర్యాదను, శాస్త్రీయతను, నిజాన్ని ఎన్నుకున్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన గాయాలను మాన్పే శక్తి ఉన్న వ్యక్తి. నేను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళనే కావచ్చు. కానీ చివరి స్త్రీని మాత్రం కాను. ఎందుకంటే ఈ ఎన్నికలను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చిన్నారులకు వారి ముందున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  
 – కమలా హ్యారీస్‌

మరిన్ని వార్తలు