నువ్వు కూడా ప్రెసిడెంట్‌ కావొచ్చు: కమల

7 Nov, 2020 15:32 IST|Sakshi

మనుమరాలితో కమలా హారిస్‌ సంభాషణ!

వాషింగ్టన్‌: డెమొక్రటిక్‌ పార్టీ నాయకురాలు, అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌.. తన మనుమరాలితో సరదాగా సంభాషిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘నువ్వు కూడా ప్రెసిడెంట్‌ కావొచ్చు’’ అంటూ చిన్నారిలో ఉత్సాహం నింపిన కమల మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ‘‘అమ్మమ్మ మాదిరిగానే.. ఆ చిన్నారి కూడా ఏదో ఒకరోజు కచ్చితంగా అగ్రరాజ్య రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇండో- ఆఫ్రికన్‌ మూలాలు గల కమలా హారిస్‌.. అగ్రరాజ్య ఉపాధ్యక్ష రేసులో నిలిచిన తొలి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొన్నటిదాకా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఆమె.. బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త విరామం దొరకగానే చెల్లెలు మాయా హారిస్‌ మనుమరాలు అమర అజగు(4)తో కాసేపు ముచ్చటించారు. 

ఆ చిన్నారిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేసిన కమల.. ‘‘నేను అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవచ్చా’’ అంటూ తను అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు. ‘‘నువ్వు కూడా ప్రెసిడెంట్‌ కావొచ్చు. అయితే నీకు 35 ఏళ్లు దాటిన తర్వాతే అది వీలు పడుతుంది. సరేనా’’ అంటూ ఆమెను ఊరడించారు. ఇందుకు స్పందించిన అమర.. ‘‘అవును.. అయితే నేను ఆస్ట్రోనాట్‌ ప్రెసిడెంట్‌ కావొచ్చా’’అంటూ మరో ప్రశ్నను సంధించింది. ఇలా గంట సేపటి దాకా అమ్మమ్మ- మనవరాళ్ల సంభాషణ కొనసాగిందట. కమలా హారిస్‌ తోబుట్టువు మాయా హారిస్‌ కుమార్తె మీనా హారిస్‌ ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా శ్యామలా గోపాలన్(తమిళనాడు)‌- డొనాల్డ్‌ హారిస్‌(జమైకా) దంపతులకు 1964 అక్టోబర్‌ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హారిస్‌ జన్మించారు. ఆమెకు సోదరి మాయా హారిస్‌ ఉన్నారు. అయితే కమలా హారిస్‌కు ఏడేళ్ల వయసు ఉన్నపుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. (చదవండి: వైరల్‌:కెప్టెన్ అమెరికాగా బైడెన్‌, థానోస్‌గా ట్రంప్‌!)

దీంతో పిల్లలిద్దరి బాధ్యతను వారి తల్లి శ్యామల స్వీకరించారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. కమలా రాజకీయాల్లో రాణిస్తుండగా.. మాయా, హిల్లరీ క్లింటన్‌ న్యాయవాదిగా, సలహాదారుగా పనిచేశారు. మాయాకు కుమార్తె మీనా హారిస్‌ ఉన్నారు. ఆమె కూడా న్యాయవాదే. చిన్నారుల కోసం పుస్తకాలు కూడా రాశారు. ఇక కమలా హారిస్‌ తన సహచర లాయర్‌ డగ్లస్‌ ఎమాఫ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలకు కమల అమ్మ ప్రేమను పంచుతున్నారు. జో బైడెన్‌ తన రన్నింగ్‌మేట్‌గా ప్రకటించిన తర్వాతి మొదటి ప్రసంగంలో భాగంగా.. ‘‘నా భర్త డగ్‌, మాకు రత్నాల్లాంటి పిల్లలు ఎలా, కోల్‌ ఉన్నారు’’ అంటూ తన కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇదిలా ఉండగా.. అధ్యక్ష పీఠం కైవసం చేసుకునే దిశగా దుసుకుపోతున్నారు. ప్రెసిడెంట్‌గా ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. దీంతో బైడెన్‌ వర్గం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.(వాటికి నో చెప్పడమే నా బ్రేక్‌ఫాస్ట్‌ : కమలా హ్యారిస్‌)

మరిన్ని వార్తలు