వైస్ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా హారిస్‌ను ఖరారు చేసిన బిడెన్‌

30 Jul, 2020 08:51 IST|Sakshi

బిడెన్‌ నోట్‌లో కమలా హారిస్‌ పేరు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో తలపడనున్న డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్‌ను బరిలో దింపుతారని, ఆమె అభ్యర్థిత్వం​ ఖారారైందని ఊహాగానాలు వెలువడ్డాయి. బిడెన్‌ చేతిలో ఉన్న నోట్‌పై కమలా హారిస్‌ అని రాసిఉండటంతో వైస్‌ ప్రెసిడెంట్‌గా ఆమె వైపు బిడెన్‌ మొగ్గుచూపారని భావిస్తున్నారు.  బిడెన్‌ అధ్యక్ష పదవికి ఎంపికైతే అప్పటికి ఆయన 78వ ఏట అడుగుపెట్టనుండటంతో రెండోసారి ఆ పదవికి పోటీపడబోనని వైస్‌ ప్రెసిడెంట్‌ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉంటారని బిడెన్‌ సంకేతాలు పంపారు. రిపబ్లికన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ముఖాముఖి తలపడుతున్న బిడెన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా మహిళను ఎంచుకుంటానని ఇప్పటికే ప్రకటించారు.

సెనేట్‌లో​ కమలా హారిస్‌ కనబరిచిన సామర్థ్యంతో పాటు ప్రస్తుతం అమెరికాను ఊపేస్తున్న బ్లాక్‌ లైవ్స్‌ అంశం కూడా భారత్‌, జమైకా మూలాలు కలిగిఉండటం కూడా హారిస్‌కు కలిసివచ్చింది. ఎలిజబెత్‌ వారెన్‌, సుసాన్‌ రైస్‌ వంటి నేతలు పోటీపడుతున్న ఈ పదవికి హారిస్‌ ఎంపిక పూర్తయిందని బిడెన్‌ నోట్‌ ద్వారా వెల్లడైంది. కాగా వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంపికపై ఆగస్ట్‌ మొదటి వారంలో తన నిర్ణయం​ వెల్లడిస్తానని బిడెన్‌ ఇటీవల ప్రకటించారు. అయితే ఆయన చేతిలో ఉన్న నోట్‌పై కమలా హారిస్‌ పేరు రాసిఉండటంతో ఆ సస్సెన్స్‌కు తెరపడింది. ఆమె పేరు కింద హారిస్‌కున్న అనుకూలతలనూ నోట్‌లో రాసుకున్నారు.

చదవండి : విచారణ కమిటీ ముందుకు టెక్‌ దిగ్గజాలు

‘ఆమె కల్మషం లేని నేత..ప్రచారంలో ఆసరాగా నిలుస్తారు..ఆమెపై అమెరికన్లలో అపార గౌరవం ఉంది’ అంటూ ఆ నోట్‌లో రాసి ఉండటం గమనార్హం. అయితే ఆ నోట్‌లో ఇతర వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్ధుల గురించి కూడా ఆయన రాసుకున్నారా అనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు కమలా హారిస్‌ ఎంపిక మంచి నిర్ణయమని ఏకంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కాగా కమలా హారిస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా జో బిడెన్‌ ఎంపిక చేసుకున్నారనే కథనం వెల్లడించిన పొలిటికో వెబ్‌సైట్‌ ఇది పొరుపాటున సైట్‌లో ప్రచురితమైందని వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన టెక్స్ట్‌ను సదరు వెబ్‌సైట్‌ వెనువెంటనే తొలగించింది.కాగా, ఈ ఏడాడి నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు