అమ్మ మాట బంగారు బాట

22 Jan, 2021 01:44 IST|Sakshi

ఆమె నమ్మకమే నేడు నిజమైంది

తల్లిని తలచుకొని కమలా హ్యారిస్‌ ఉద్వేగం

వాషింగ్టన్‌: అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన వేళ భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ మరోసారి తన తల్లిని తలచుకొని ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె తన పట్ల ఉంచిన నమ్మకమే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు. భారత్‌కు చెందిన శ్యామలా గోపాలన్‌ 19 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూనే పౌర హక్కుల ఉద్యమకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కమలా హ్యారిస్‌పై తన తల్లి ప్రభావం చాలా ఎక్కువ. ఇండియన్‌ అమెరికన్‌ న్యాయ, రాజకీయ యాక్షన్‌ కమిటీ ఇంపాక్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యక్షురాలు కమల మరోసారి తన తల్లి చెప్పిన మాటల్ని అందరితోనూ పంచుకున్నారు. ‘ఎంతో మంది అమెరికన్ల కథే నా కథ కూడా. నా తల్లి శ్యామలా గోపాలన్‌ భారత్‌ నుంచి వచ్చారు. నన్ను నా చెల్లి మాయని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశారు. మనమే మొదటి వాళ్లం కావొచ్చు.  కానీ మనం ఎప్పటికీ ఆఖరి వాళ్లం కాదని మా అమ్మ తరచూ చెబుతూ ఉండేవారు’’ అని కమల గుర్తు చేసుకున్నారు.

మహిళా శక్తికి వందనం
కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకారానికి ముందు ట్విట్టర్‌లో ఉంచిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. తనకంటే ముందు ఈ గడ్డపై అడుగుపెట్టిన వారికి నివాళులర్పిస్తూ ఈ వీడియో చేశారు. ‘నా కంటే మా అమ్మ మొదట ఇక్కడికి వచ్చింది. మా అమ్మ శ్యామలా గోపాలన్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా నా హృదయంలో శాశ్వతంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మా అమ్మ అమెరికాకి వచ్చినప్పుడు తన కుమార్తె ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించి ఉండదు. కానీ అమెరికాలో మహిళకి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆమెకు గట్టి నమ్మకం. ఆ నమ్మకమనే బాటలోనే నడిచి నేను ఇంతవరకు వచ్చాను. అందుకే అమ్మ మాటల్ని ప్రతీ క్షణం తలచుకుంటూనే ఉంటాను’’ అని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కోసం పోరాటాలు, త్యాగాలు చేసే మహిళల్ని చాలాసార్లు ఈ దేశం గుర్తించకపోవచ్చు. కానీ కొన్నిసార్లు వారే ఈ దేశానికి వెన్నెముకగా ఉంటారని రుజువు అవుతూనే ఉందని కమల వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు