కొద్దిసేపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్‌

20 Nov, 2021 04:29 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌(57)కు శుక్రవారం కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్‌ రికార్డుకెక్కారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 79వ పడిలోకి ప్రవేశించారు. వాషింగ్టన్‌ శివారులోని వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌లో చేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. బైడెన్‌కు శుక్రవారం మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్‌ వైట్‌హౌస్‌ వెస్ట్‌వింగ్‌లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. అణ్వాయుధాల నియంత్రిత వ్యవస్థలతో కూడిన బాక్సు కూడా ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది. పరీక్షల అనంతరం బైడెన్‌ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి.  2002, 2007లో అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ ఇలాగే కలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు సందర్భాల్లో తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీకి బదిలీ చేశారు.  

మరిన్ని వార్తలు