చరిత్ర సృష్టించిన జో బిడెన్

12 Aug, 2020 08:15 IST|Sakshi

అమెరికా ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జో బిడెన్‌  కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిపారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా మహిళను ఎంచుకుంటానని ఇప్పటికే ప్రకటించిన బిడెన్ ఈ పదవికి మొదటి నల్లజాతి మహిళను పోటీలో నిలిపి చరిత్ర సృష్టించారు. 

బ్లాక్ ఓటర్లను ఆకర్షించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెక్ పెట్టే  వ్యూహంలో భాగంగా బిడెన్ హారిస్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్నిబిడెన్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకులలో ఒకరంటూ హారిస్ ను ప్రశంసించిన బిడెన్ మీతో కలిసి, ట్రంప్ ను ఓడించబోతున్నామంటూ పేర్కొన్నారు.  అటు హారిస్ కూడా తనను ఎంపిక చేసినందుకు సంతోషం ప్రకటిస్తూ  ట్వీట్ చేశారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా  సైతం  హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలకడం విశేషం. అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఒక మహిళ అధ్యక్షులుగా లేదా ఉపాధ్యక్షురాలిగా పనిచేయలేదు. ప్రధాన పార్టీలకు సంబంధించి ఇద్దరు మహిళలు రన్నింగ్ మేట్స్‌గా నామినేట్ అయ్యారు 1984 లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008 లో రిపబ్లికన్ సారా పాలిన్ బరిలో నిలిచినా ఆ పార్టీలు ఓడిపోయాయి. దీంతో తాజాగా హారిస్ ఎంపికపై అభినందనల వెల్లువ కురుస్తోంది.

మరిన్ని వార్తలు