ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ నామినేట్‌

21 Aug, 2020 03:33 IST|Sakshi

అధికారికంగా ప్రకటించిన డెమొక్రాట్‌ పార్టీ

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్‌ అభ్యర్థిగా పార్టీ నామినేట్‌ చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న పార్టీ జాతీయ సదస్సులో బుధవారం ఆమె అ«భ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కమలా హ్యారిస్‌ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వ వైఫల్యాల కారణంగా అమెరికా ప్రజలు తమ జీవితాల్నే పణంగా పెట్టారన్నారు. తాను భారత్, జమైకా వలసదారుల బిడ్డగా చెప్పుకున్నారు.

అమ్మ పై నుంచి చూస్తూ ఉంటుంది
తల్లి శ్యామలా గోపాలన్‌ చెప్పిన మాటల్నే ఆమె మళ్లీ తలచుకున్నారు. ‘‘ఇతరులకు సేవ చేస్తే మన జీవితానికి  పరమార్థం వచ్చినట్టవుతుంది. ఇప్పుడు నాకు ఆ సేవ చేసే అవకాశం దక్కబోతోంది. ఇలాంటి సమయంలో అమ్మ నా దగ్గరే ఉండాలని కోరుకున్నాను. కానీ పై నుంచి అమ్మ అంతా చూస్తూ ఉంటుందని నాకు తెలుసు’’అని అన్నారు. ‘‘అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా మీరు చేసిన నామినేషన్‌ను నేను ఆమోదిస్తున్నాను. బహుశా నేను ఈ స్థాయికి ఎదుగుతానని మా అమ్మ ఊహించి ఉండదు’’అని చెప్పారు. ‘‘నల్లజాతి మూలాలు, భారతీయ వారసత్వం కలిగినందుకు గర్వపడేలా అమ్మ పెంచారు ’’అని కమల చెప్పారు.  

>
మరిన్ని వార్తలు