కమలా హారిస్‌ ఫొటో: నెటిజన్ల ఫైర్‌!

11 Jan, 2021 14:38 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజీన్‌ వోగ్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రమాణాలు పాటించకుండా ప్రముఖుల ఫొటోలను వాడుతూ.. వారిని అగౌరవ పరిచేలా వ్యవహరించడం సరికాదంటూ విమర్శిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమొక్రాట్‌ కమలా హారిస్‌ కవర్‌ ఫొటోతో వోగ్‌ ఫిబ్రవరి సంచికను తెస్తోంది. ‘‘ప్రజల చేత, ప్రజల కోసం, అమెరికా ఫ్యాషన్‌’’ అనే క్యాప్షన్‌తో కమల నిలబడి ఉన్న ఈ ఫొటోలో.. ఆమె మేని ఛాయను కాస్త తెలుపుగా మార్చినట్లు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు వోగ్‌పై విమర్శలకు కారణమైంది. (చదవండి: ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్‌)

కాగా అగ్రరాజ్య చరిత్రలో తొలి మహిళా వైస్‌ ప్రెసిడెంట్‌గా, అందునా ఈ పదవిని అధిరోహించిన తొలి నల్లజాతీయురాలిగా కమల చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. జమైకా- భారత్‌ మూలాలున్న ఆమె సాధించిన ఈ విజయం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా శ్వేతజాతీయేతరురాలిగా ఆమె దక్కించుకున్న ఘనతపై అభినందనల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కమల ఫొటోలో ఆమె రంగు పట్ల వోగ్‌ వ్యహరించిన తీరుపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ‘‘రంగు మార్చడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి. అసలేం చెప్పదలచుకున్నారు’’ అని కొంతమంది ప్రశ్నిస్తుండగా.. ‘‘బహుశా ఇది ఫేక్‌ ఫొటో అయి ఉంటుందని, మీకు కావాలంటే మా ఫోన్లలో ఇంతకంటే మంచి ఫొటోలు ఉన్నాయి పంపిస్తాం’’ అని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు