తాతయ్యను గుర్తు చేసుకున్న కమలా హారిస్‌

27 Aug, 2020 09:20 IST|Sakshi

‘‘నా బాల్యంలో ఇండియాకు వెళ్లినపుడు.. మా తాతయ్య నన్ను తరచుగా మార్నింగ్‌ వాక్‌కు తీసుకువెళ్లేవారు. పెద్ద మనుమరాలినైనందుకు నాకు ఆ అవకాశం దక్కేది. ప్రజాస్వామ్యం గురించి, పౌర హక్కులకై పోరాడాల్సిన తీరు గురించి వివరించేవారు. ఆయన స్నేహితులంతా కూడా గొప్ప గొప్ప నాయకులుగా ఎదిగిన వాళ్లే. ఎక్కడ, ఏ పరిస్థితుల్లో జన్మించామనే విషయంతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయని చెప్పేవారు.

అలా ఇండియాలోని బీచ్‌లో నడుస్తూ ఆనాడు నేను విన్న మాటలు నాలో పోరాటపటిమ రగిల్చాయి. హక్కుల కోసం పోరాడే నిబద్ధతను పెంచాయి. అవన్నీ ఈరోజు నేను ఉన్న ఈ స్థాయిలో నన్ను నిలబెట్టాయని నమ్ముతున్నాను’’ అంటూ కమలా హారిస్‌ చెన్నైలో తన తాతయ్య పీవీ గోపాలన్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న ఆయన తనపై ఎంతో ప్రభావం చూపారని, అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని చెప్పుకొచ్చారు. (చదవండి: మెసేజ్‌ పెడితే చాలు వచ్చేస్తుంది: సరళా గోపాలన్‌)

ఈ మేరకు తన బామ్మతాతయ్యల ఫొటోలు, భారత స్వాతంత్ర్య పోరాటంలోని దృశ్యాలతో పాటు అమెరికాలో తాను పౌర హక్కుల ఉద్యమంలో పాల్గొన్న ఫొటోలతో కూడిన 57 సెకండ్ల నిడివి గల వీడియోను కమల ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా అమెరికా ఉపాధ్య పదవికి పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళగా కమలా హ్యారిస్‌ అగ్రరాజ్యంలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున వైఎస్‌ ప్రెసిడెంట్‌ రేసులో నిలిచిన ఆమె ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార హోరు పెంచారు. అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలను ఎండగడుతూనే, తన భారత మూలాలను గుర్తు చేసుకుంటూ ఇండో- అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: అమ్మే నాకు స్ఫూర్తి.. రియల్‌ హీరో: కమలా హారిస్‌)

అదే విధంగా భారత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని, తల్లి శ్యామలా గోపాలన్‌ పౌర హక్కుల ఉద్యమంలో పాల్గొనడం, భారత సంస్కృతీ సంప్రదాయాల పట్ల తనకున్న గౌరవమర్యాదలు తదితర అంశాలను తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా కమల తండ్రి డేవిడ్‌ హ్యారిస్‌ జమైకాకు చెందినవారు. తల్లి డాక్టర్‌ శ్యామలా గోపాలన్‌ భారత్‌లోని తమిళనాడు నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. 

మరిన్ని వార్తలు