ట్రంప్‌ చేతకానితనం వల్లనే ఈ భారీ నష్టం

8 Oct, 2020 14:06 IST|Sakshi

హారిస్‌ వ్యాఖ్యలు వ్యాక్సిన్‌పై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ దారుణంగా విఫలమయ్యిందని.. అసలు ఎన్నికల్లో పోటీ చేసే​ అర్హత కోల్పోయింది అంటూ డెమొక్రాటిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి కమలా హారిస్‌ నిప్పులు చెరిగారు. సాల్ట్‌లేక్‌లోని కింగ్స్‌ బర్రీహాల్‌లో జరిగిన అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల‌ ముఖాముఖిలో ట్రంప్‌ పాలనపై ఆమె విమర్శలు కురిపించారు. ప్రభుత్వం కరోనా వ్యాప్తిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. జో బైడెన్ చెప్పినట్లు కరోనా కట్టడికి సంబంధించి ట్రంప్‌ దగ్గర ఒక ప్రణాళిక లేదన్నారు. స్వయంగా అధ్యక్షుడు మాస్క్‌ ధరించడకుండా ప్రజలను తప్పుదోప పట్టించారని మండి పడ్డారు. ఒకవేళ ట్రంప్‌ మాస్క్‌ ధరిస్తే పరిస్థితులు మరోలా ఉండేవన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో అగ్రరాజ్యం ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 75 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 2 లక్షలకు పైగా మంది మృత్యువాత పడ్డారు. (కరోనా దేవుడిచ్చిన వరం : ట్రంప్)

ఈ క్రమంలో హారిస్‌ ‘కోవిడ్‌-19 తీవ్రత గురించి తెలిసి కూడా వైట్‌ హౌస్‌ సరైన చర్యలు తీసుకోలేదు. అధ్యక్షుడు దీనిని అభూత కల్పన అంటూ కొట్టి పారేశారు. అమెరికన్‌ చరిత్రలో ఏ అధ్యక్షుడి పాలనలో కూడా ప్రజలు ఇంతటి వైఫల్యాన్ని చూడలేదు’ అన్నారు. ఇక ట్రంప్‌ ఆమోదించిన టీకాను తాను తీసుకోనని హారిస్‌ స్పష్టం చేశారు. ఆంథోని ఫౌసీ వంటి నిపుణులు సూచిస్తే వ్యాక్సిన్‌ తీసుకుంటాను. కానీ డొనాల్డ్‌ ట్రంప్‌ చెబితే మాత్రం తీసుకోను అన్నారు. అయితే హారిస్‌ వ్యాఖ్యల్ని మైక్‌ పెన్స్‌ ఖండించారు. మొదటి నుంచి ట్రంప్‌ అమెరికన్ల ఆరోగ్యానికి ప్రథమ స్థానం ఇచ్చారని తెలిపారు. మరే ఇతర అధ్యక్షుడు చేయని విధంగా ట్రంప్‌ చర్యలు తీసుకున్నారు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా నుంచి అన్ని ప్రయాణాలను నిలిపివేసాడు. ట్రంప్ నిర్ణయం లక్షలాది మంది ప్రాణాలను కాపాడిందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ విషయంలో హారిస్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు