ఏడాది పూర్తయినా ఇంకా పోరాటమే...

20 Jan, 2022 05:10 IST|Sakshi

ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌కు 44 శాతమే మద్దతు

వలసలపై రిపబ్లికన్స్‌ విమర్శలు

ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌కు 44 శాతమే మద్దతు

వలసలపై రిపబ్లికన్స్‌ విమర్శలు

వాషింగ్టన్‌: అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఆమె వ్యవహారదక్షతపై ఎన్నో విమర్శలొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడితో ఆమె సఖ్యతపై ప్రశ్నలు ఓవైపు, ఉపాధ్యక్ష పదవికి సరైన పరిశీలన లేకుండానే ఎంపిక చేశారన్న ప్రత్యర్థుల ఆరోపణలు మరోవైపు.. శ్వేతసౌధం నుంచి సరైన మద్దతు లేకపోవడం వంటి ఎన్నో సవాళ్ల మధ్య ఆమె ఏడాది పాలన సాగింది.

సాధారణ రోజుల్లోనే ఉపాధ్యక్ష బాధ్యతలో రాణించడం చాలా కష్టం... కరోనా మహమ్మారి సమయంలో అది మరింత సంక్లిష్టంగా మారింది. అధ్యక్షుడికి అంతర్గతంగా సలహాలు, సూచనలు ఎన్ని చేసినా, రోజువారీ ఘటనలపై ఆమె స్పందనపై విమర్శలొస్తున్నాయి. ఓటింగ్‌ హక్కుల బిల్లును ఆమోదించడం, మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసలను నిరోధించి, పరిష్కార చేయడం వంటి కీలక బాధ్యతలను బైడెన్, కమలాహారిస్‌కు అప్పగించారు.

వీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్‌ యాక్సెస్‌ను ముందుకు తీసుకెళ్లడం, స్పేస్‌ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం వంటివి ఆమె ముందున్నాయి. వీటన్నింటిలో ముఖ్యంగా వలసలనే రిపబ్లికన్‌లు లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె సరిగా పనిచేయకపోవడంవల్లే వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రగతిశీలమైన ధిక్కార గొంతుగా భావించిన ఆమె మద్దతుదారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

గతేడాది గ్వాటెమాల, మెక్సికోలో పర్యటన సందర్భంగా వలసదారులనుద్దేశించి ‘‘ఎవ్వరూ రావొద్దు’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై యునైటెడ్‌ లాటిన్‌ అమెరికన్‌ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ బాధ్యతల నిర్వహణపై డిసెంబర్‌లో ఓ ప్రజాభిప్రాయ సేకరణ జరపగా ఆమెకు మద్దతుగా 44శాతం ఓట్లు, వ్యతిరేకంగా 54శాతం ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడికి సైతం దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. హ్యారిస్‌ను చిత్రీకరించడంలో మీడియా ఆమె స్టైల్‌మీదనే శ్రద్ధ పెట్టిందని డెమొక్రాటిక్‌ వ్యూహకర్త కరేన్‌ ఫిన్నే అభిప్రాయపడ్డారు.   

మధ్యంతర ముప్పు తప్పదా!?
జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. కరోనా, పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, దేశీయ విధానాలు, విదేశీ ఒప్పందాల విషయంలో ఆయన చేసిన వాగ్దానాల్లో కొన్ని పరిష్కారమయ్యాయి. కొన్ని ప్రగతిలో ఉన్నాయి. ఇంకొన్నింటినీ నిలబెట్టుకోలేకపోయారు. వీటన్నింటిలోనూ ఇప్పుడు అతిపెద్ద ముప్పు కోవిడ్‌–19. అమెరికాలో 61 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని సైతం ఛేదించే దశలో ఉన్నారు. అయినా అది చూపిన ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. బైడెన్‌ను ఆమోదించే వారి సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. దీన్ని పరిష్కరించలేకపోతే మధ్యంతరం ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు విశ్లేషకులు.  

మరిన్ని వార్తలు