ఒక్కసారి కాదు.. ఏకంగా 26 సార్లు ఎవరెస్టు ఎక్కేశాడు

9 May, 2022 06:14 IST|Sakshi

నేపాల్‌ షెర్పా కామి రీతా ఘనత

సొంత రికార్డు బద్దలు కొట్టిన వైనం

కఠ్మాండూ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైన అధిరోహించాలన్నది ఎందరో పర్వతారోహకుల కల. అలాంటిది, నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా ఎవరెస్టును ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 26 సార్లు అధిరోహించాడు! ఆ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 52 ఏళ్ల  కామి 10 మందితో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ శనివారం 26వ సారి ఎవరెస్టును ఎక్కినట్టు సెవన్‌ సమ్మిట్‌ ట్రెక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మేనేజర్‌ దావా షెర్పా వెల్లడించారు.

1953లో సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ, టెన్సింగ్‌ నార్కే తొలిసారి వెళ్లిన ఏ మార్గంలోనే కామి బృందం కూడా శిఖరానికి చేరింది. రీతా తొలిసారి 1994లో ఎవరెస్టును అధిరోహించాడు. ప్రపంచంలో రెండో ఎత్తైన మౌంట్‌ గాడ్విన్‌ ఆస్టిన్‌ (కే2)తో పాటు హోత్సే, మనాస్లూ, చో ఓయూ శిఖరాలను కూడా ఆయన ఎక్కాడు. 8 వేల మీటర్ల కంటే ఎత్తైన ఎక్కువ శిఖరాలను అధిరోహించిన రికార్డు కూడా రీతాదే! 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టును ఎక్కడానికి నేపాల్‌ పర్యాటక శాఖ ఈ ఏడాది 316 మందికి అనుమతినిచ్చింది.

మరిన్ని వార్తలు