చైనాపై దూకుడు కూడా సానుకూలాంశమే

17 Sep, 2020 09:37 IST|Sakshi

సానుకూల ఫలితాలిచ్చిన హౌడీ మోదీ, నమస్తే ట్రంప్‌ ర్యాలీలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇండియాస్పొరా అండ్‌ ఏషియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐల్యాండర్స్‌ (ఏఏపీఐ) డేటా సర్వే పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఇండియన్‌ అమెరికన్స్‌ డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతిస్తారని ఈ సర్వే తెలిపింది. అయితే గత ఎన్నికలతో పొల్చితే.. ఈ సారి ట్రంప్‌కు మద్దతిచ్చే ఇండియన్‌ అమెరికన్‌ల సంఖ్య పెరిగినట్లు సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు గల కారణాలను కూడా సర్వే వెల్లడించింది. కశ్మీర్‌ అంశం డెమొక్రాట్‌ల కొంపముంచిందని ఈ సర్వే తెలిపింది. కశ్మీర్‌ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల డెమొక్రాట్లు దూకుడుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ట్రంప్,‌ భారత్‌కు మద్దతిచ్చారు. ఇదే కాక ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’‌ వంటి ర్యాలీల్లో అధ్యక్షుడు పాల్గొనడం వంటి అంశాలు భారత్‌-అమెరికా మైత్రికి నిదర్శనంగా నిలిచాయని.. ఫలితంగా ట్రంప్‌కు మద్దతుదారులు పెరిగారని సర్వే వెల్లడించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని భారత్‌కు మిత్రులెవరు.. కానీ వారు ఎవరు అనే దాన్ని బెరీజు వేశారని సర్వే తెలిపింది. (చదవండి: ఏనుగు లేదా గాడిద.. ఎవరిది పైచేయి?!)

అంతేకాక ప్రస్తుతం చైనాకు వ్యతిరేకంగా ట్రంప్‌ చేస్తోన్న వ్యాఖ్యలు కూడా ఆయనకు అనుకూలిస్తాయని సర్వే తెలిపింది. ఇకపోతే డెమొక్రాట్లు కశ్మీర్‌ అంశంలో మోదీని విమర్శించడమే కాక మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీని మెజారిటీ హిందూ ఎజెండాను అనుసరిస్తున్నారని ఆరోపించారు. ఇవన్ని ట్రంప్‌కు కలిసొచ్చిన అంశాలుగా సర్వే తెలిపింది. ఇన్ని సానుకూల అంశాలున్నప్పటికి 66 శాతం మంది ఇండియన్‌ అమెరికన్లు బైడెన్‌కు మద్దతుగా ఉంటే, ట్రంప్‌కి 28శాతం మాత్రమే అనుకూలంగా ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు