ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్‌.. జైల్లోనే

17 Aug, 2021 15:54 IST|Sakshi

కాబూల్‌: తాలిబన్ల వశమైన అఫ్గానిస్తాన్‌లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దేశంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. సాధారణ ప్రజలే ఇలా ఉంటే జైళ్లల్లో ఉన్న ఖైదీలు భయాందోళన చెందుతున్నారు. ఆ జైళ్లల్లో మగ్గుతున్న వారిలో పలువురు భారతీయులు ఉన్నారు. వారిలో కేరళకు చెందిన నయని అలియాస్‌ ఫాతిమా కథ వింటే కన్నీళ్లు రాకుండా ఉండవు. ప్రేమించిన యువకుడిని పెద్దలను వివాహం చేసుకుని అఫ్గానిస్తాన్‌ వెళ్లింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో కలిసి ఉగ్రవాదిగా మారింది. భర్త చనిపోగా ఆమె జైలు జీవితం గడుపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: మొదలైన తాలిబన్ల అరాచకం.. ఇంటింటికెళ్లి నగదు లూటీ

కేరళకు చెందిన బిందు, సంపత్‌ల కుమార్తె నిమిష దంత వైద్యురాలు. ఆమె ఒకరిని ప్రేమించింది. పెద్దలు వారిస్తున్నా వినకుండా మతం మార్చుకుని వివాహం చేసుకుంది. నిమిష తన పేరు ఫాతిమాగా మార్చుకుంది. అయితే 2016లో భర్తతో కలిసి నిమిష అఫ్గనిస్తాన్‌కు వెళ్లింది. అక్కడ భర్తతో పాటు ఆమె కూడా ఉగ్రవాదిగా మారింది. ఈ క్రమంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు కాల్పుల్లో భర్త మరణించాడు. తన పాపతో కలిసి అక్కడే జీవిస్తున్న ఫాతిమాకు ప్రాణభయం ఏర్పడింది. తమను హతమారుస్తాయనే భయంతో 2019లో అఫ్గాన్‌ ప్రభుత్వానికి ఫాతిమా లొంగిపోయింది. అప్పటి నుంచి ఫాతిమా జైల్లో ఉంటోంది.

అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఫాతిమా తల్లి బిందు ఆందోళనలో ఉన్నారు. బందీగా ఉన్న తన కుమార్తెను విడిపించుకురావాలని బిందు కేంద్ర ప్రభుత్వానికి 1,882 సార్లు విజ్ఞప్తి చేసింది. తన బిడ్డ ఉగ్రవాది కాదని, ఆమె రాకతో దేశానికి వచ్చిన ముప్పేం లేదని స్పష్టం చేసింది. కాబూల్‌ జైల్లో ఉంటున్న తన కుమార్తె విడుదలకు సహకరించాలని ఆమె కనిపించిన మంత్రి, ఎమ్మెల్యేలందరినీ కోరుతోంది. అయితే ఫాతిమాతో పాటు మరో 20 మంది యువతులు అఫ్గాన్‌ వెళ్లారని తెలిసింది. వారిలో ఫాతిమా మాదిరి ముగ్గురు మహిళలు మారారని, వారు జైళ్లో ఉంటున్నారని వారిని విడుదల చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: కాబూల్‌ ఎయిర్‌పోర్టులో కాల్పులు.. ఐదుగురు మృతి

మరిన్ని వార్తలు