సోదరికి సగం అధికారాలు?

22 Aug, 2020 04:04 IST|Sakshi
కిమ్‌ జాంగ్‌ ఉన్,‌ కిమ్‌ యో జాంగ్

విదేశీ వ్యవహారాలన్నీ కిమ్‌ యో జాంగ్‌కే

2వ అధికార కేంద్రంగా ఎదిగేలా చర్యలు

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ నిర్ణయం

దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడి

సియోల్‌: ఉత్తర కొరియా అ«ధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన సోదరి కిమ్‌ యో జాంగ్‌ను రెండో అధికార కేంద్రంగా ఎదిగేలా కీలక చర్యలు తీసుకున్నారు. ఎన్నో అధికారాలను జాంగ్‌కు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారని దక్షిణ కొరియా నిఘా విభాగం వెల్లడించింది. అమెరికా, దక్షిణ కొరియాతో సంబంధాల వ్యవహారాలన్నీ ఇక పై జాంగ్‌ పర్యవేక్షిస్తారు. కిమ్‌ నిర్ణయంతో దేశంలోని రెండో శక్తిమంతమైన మహిళగా జాంగ్‌ ఎదిగారు.

విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జాంగ్‌కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కిమ్‌ తర్వాత దేశాన్ని నడిపించే రెండో కమాండర్‌గా ఆమె వ్యవహరిస్తున్నారని దక్షిణ కొరియా ఎంపీ హా తాయ్‌ క్యెంగ్‌ వెల్లడించారు. అంతర్జాతీయ సంబంధాలలో వైఫల్యాలు ఎదురైతే తన చేతికి మరక అంటకుండా అనారోగ్య కారణాలతో పని భారాన్ని తగ్గించుకోవడానికి కిమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కిమ్‌ మరణించారన్న వదం తులు ప్రచారమైనప్పుడు కూడా జాంగ్‌కే దేశ పగ్గాలు అప్పగిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సోదరిపై కిమ్‌కు ఎనలేని విశ్వాసం
తన నీడను కూడా నమ్మని కిమ్‌కు సోదరి జాంగ్‌ పట్ల ఎనలేని విశ్వాసం ఉంది. కిమ్‌ సలహాదారుల్లో ఒకరైన ఆమె ఈ మధ్య కాలంలో ఎక్కువగా కిమ్‌ పక్కనే కనిపిస్తున్నారు. తొలిసారిగా ఆమె పేరుతో అధికారిక ప్రకటన ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. దక్షిణ కొరియా విధానాలపై విరుచుకుపడుతూ ఆమె ప్రకటన ఇచ్చారు. అమెరికాతో దౌత్య వ్యవహారాలకు సంబంధించి జూలైలో తన వ్యక్తిగత అభిప్రాయాలంటూ ఆమె కొన్ని కామెంట్లు చేశారు. 1988లో జన్మించిన జాంగ్‌ స్విట్జర్లాండ్‌లో విద్యాభ్యాసం చేశారు. 2011లో తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణానంతరం సోదరుడు కిమ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆమె కూడా పార్టీలో చేరారు. నెమ్మది నెమ్మదిగా పొలిట్‌ బ్యూరో సెంట్రల్‌ కమిటీలో ఎదుగుతూ కిమ్‌ విశ్వాసాన్ని పొందారు.  

మరిన్ని వార్తలు