కిమ్‌ సోదరి పబ్లిక్‌ మీటింగ్‌లకు హాజరుకావడం లేదా?

1 Sep, 2020 08:47 IST|Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిపై అనేక రకాల సందేహాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఆయన కోమాలోకి వెళ్లారని, ఏ క్షణమైనా మరణించే అవకాశం ఉందంటూ పలుమార్లు వదంతులు వ్యాపించాయి. దాయాది దక్షిణ కొరియా సైతం కిమ్‌ అనారోగ్యంపై సందేహాలు వ్యక్తం చేసింది. అంతేగాకుండా కిమ్‌ వారసురాలి ఎంపిక జరిగిపోయిందని, సోదరి కిమ్‌ యో జాంగ్‌ను రెండో అధికార కేంద్రంగా ఎదిగేలా ఆయన కీలక చర్యలు తీసుకున్నారని వెల్లడించింది. అందుకు తగ్గట్టుగానే కిమ్‌ సలహాదారుల్లో ఒకరైన జాంగ్‌.. ఈ ఏడాది మార్చిలో దక్షిణ కొరియా విధానాలపై విరుచుకుపడుతూ అధికారిక ప్రకటన జారీ చేశారు. తన సోదరుడిని విమర్శించే వారిని సంకర జాతి కుక్కలు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. (చదవండి: కిమ్‌కి ఏమీ కాలేదు)

అంతేగాకుండా కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదంటూ దాయాది దేశానికి హెచ్చరికలు జారీ చేసిన ఆమె.. ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికగా నిలిచిన అనుసంధాన కార్యాలయాన్ని పేల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అగ్రరాజ్యం అమెరికాతోనూ దౌత్య పరమైన వ్యవహారాలకు సంబంధించి జూలైలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉత్తర కొరియాకు కీలకమైన విదేశాంగ విధానాలలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తూ.. అన్నకు తగ్గ చెల్లెలు అనిపించుకున్నారు. కిమ్‌ తర్వాత నెంబర్‌ 2గా ఎదిగి తన ఉనికిని చాటుకున్నారు. ఒకానొక సమయంలో అంతర్జాతీయ మీడియాలో కిమ్‌ కంటే కూడా జాంగ్‌ పేరే ఎక్కువగా వినిపించే స్థాయికి చేరుకున్నారు. అయితే ఆ పాపులారీటియే ఇప్పుడు ఆమె పట్ల కిమ్‌ ఆగ్రహానికి కారణమైందని ఉత్తర కొరియా రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. (చదవండి: సోదరి ఆదేశాలు.. సైనిక చర్య వద్దన్న కిమ్‌!)

గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తుంటే.. జూలై 27 తర్వాత జరిగిన ఏ ఒక్క బహిరంగ సమావేశానికి జాంగ్‌ హాజరుకాలేదు. అంతేగాక అధికార వర్కర్స్‌ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలైన ఆమె.. తాను పాల్గొనాల్సిన సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. తన కంటే సోదరి జాంగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందని భావించిన కిమ్‌ ఆదేశాలు, ఆగ్రహం కారణంగానే ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. అంతేగాక దక్షిణ కొరియాపై సైనిక చర్యకు సిద్ధమంటూ జాంగ్‌ జారీ చేసిన ఆదేశాలను కిమ్‌ నిలిపివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.  ఏదేమైనా కిమ్‌ అనంతరం ఉత్తర కొరియాలో కీలక నేతగా ఎదిగే అవకాశం జాంగ్‌కే ఉందని, అయితే అదే సమయంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే ఆమెకు కట్టబెట్టిన అధికారాలను కత్తిరించేందుకు కిమ్‌ ఏమాత్రం వెనకాడబోరని అభిప్రాయపడ్డారు. 

కాగా 1988లో జన్మించిన జాంగ్‌ స్విట్జర్లాండ్‌లో విద్యనభ్యసించారు. 2011లో తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణానంతరం, సోదరుడు కిమ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆమె కూడా పార్టీలో చేరి అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగారు. ఇకకిమ్‌ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించిన ప్రతిసారీ జాంగ్‌ అన్నీ తానే అయి ముందుండి నడిచిన విషయం తెలిసిందే. అయితే అధికార మీడియా మాత్రం ఎప్పటికప్పుడు కిమ్‌ పార్టీ సమావేశాల్లో, అధికారిక చర్చల్లో పాల్గొన్నట్లుగా ఉన్న ఫొటోలను విడుదల చేస్తూ ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారన్న సంకేతాలు ఇస్తూ ఉంది. కానీ ఆ ఫొటోలు తాజా చర్చలకు సంబంధించినవా లేదా పాత ఫొటోలా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు