ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్‌.. కూతురి పరిచయం ఇలాగ!

19 Nov, 2022 09:25 IST|Sakshi

ప్యోంగ్యాంగ్‌: ఉత్తర కొరియాలో ఏం జరిగినా.. పొరుగున ఉన్న దక్షిణ కొరియా నిఘా ఏజెన్సీలు వెల్లడిస్తేనే బయటి ప్రపంచానికి తెలిసేది!. కేవలం తమ దర్పం ప్రదర్శించే వ్యవహారాలను మాత్రమే ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ అధికారికంగా ప్రదర్శిస్తుంటుంది. అలాంటిది ఎవరూ ఊహించని రీతిలో ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌!.

ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడి వ్యక్తిగత విషయాల గురించి బయటి ప్రపంచానికి తెలిసి చాలా చాలా తక్కువే. ఈ క్రమంలో ఆయన ఇప్పుడు తన కూతురిని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు!. శుక్రవారం ఉత్తర కొరియా వాసాంగ్‌-17 ఖండాంతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ను శుక్రవారం పరీక్షించింది. ఆ బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని పరిశీలించేందుకు కూతురిని వెంట పెట్టుకుని మరీ వెళ్లాడట కిమ్‌ జోంగ్‌ ఉన్‌. 

ఆ చిన్నారి చెయ్యి పట్టుకుని మరీ క్షిపణి ప్రయోగ ప్రాంగణం అంతా కలియదిరిగాడు కిమ్‌. ఈ ఇద్దరూ ప్రయోగ వేదిక వద్ద హల్‌ చల్‌ చేసిన ఫొటోలు కొరియా న్యూస్‌ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చాయి. అయితే ఆ చిన్నారి పేరును ప్రకటించకపోయినా.. కూతురిని మీడియా ముందుకు, అదీ క్షిపణి ప్రయోగానికి తీసుకురావడం ఆశ్చర్యకరపరిణామని వర్ణించింది కొరియా న్యూస్‌ ఏజెన్సీ. 

ఇక.. కిమ్‌కు ముగ్గురు సంతానం అని, అందులో ఇద్దరు అమ్మాయిలేనని కథనాలు చక్కర్లు కొడుతుంటాయి. సెప్టెంబర్‌ నేషనల్‌ హాలీడే సందర్భంగా పిల్లలతో ఆయన సరదాగా గడపగా.. అందులో కిమ్‌ పిల్లలు కూడా ఉన్నారంటూ కథనాలు ప్రచారం అయ్యాయి. మరోవైపు కిమ్‌ వివాహంపై రకరకాల ప్రచారాలు చక్కర్లు కొడుతుంటాయి.  ఈ నేపథ్యంలో ఆ చిన్నారి కూతురు అయ్యి ఉండకపోవచ్చనే వాదనా వినిపిస్తోంది ఇప్పుడు.

మరిన్ని వార్తలు