ఆమె బతికే ఉంది.. ఇదిగో సాక్ష్యం

17 Feb, 2021 14:45 IST|Sakshi
కిమ్‌ జోంగ్‌ ఇల్‌ జయంతి వేడుకలకు భర్తతో కలిసి హాజరైన రి సోల్‌ జు

13 నెలల తర్వాత దర్శనమిచ్చిన కిమ్‌ భార్య

మామ జయంతి వేడుకల్లో పాల్గొన్న రి సోల్‌ జు

సియోల్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్ పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎప్పుడు ఎవరు తెర మీదకు వస్తారో.. ఎవరు కనుమరుగవుతారో చెప్పడం చాలా కష్టం. స్వయంగా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్నే చాలా రోజుల పాటు కనమరుగయ్యారు. దాంతో ఆయన చనిపోయాడని.. ఇక బాధ్యతలు కిమ్‌ సోదరి చేతిలోకి వెళ్తాయని ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ.. కొన్ని రోజుల క్రితం కిమ్‌ తెరమీదకు వచ్చారు. ఇదిలా ఉండగా కిమ్‌ భార్య కనిపించి ఏడాది పైనే అవుతోంది. ప్రసుత్తం ఆమె గర్భవతిగా ఉంది అందుకే కనిపించడం లేదనే వార్తలు కొన్ని రోజులు షికారు చేశాయి. ఏడాది కాలం పూర్తయిన ఆమె బహిరంగంగా కనిపించకపోవడంతో.. ఇక ఆమె చనిపోయి ఉంటుంది.. లేదా చంపేశారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా కిమ్‌ భార్య రి సోల్ జు మంగళవారం తన భర్తతో కలిసి కనిపించారు. తన మామ కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కన్‌సర్ట్‌కి ఆమె తన భర్త కిమ్‌ జాంగ్‌‌ ఉన్‌తో కలిసి హాజరయ్యారు. రి సోల్‌ జు ఇలా పబ్లిక్‌గా దర్శనమిచ్చి దాదాపు ఏడాది పైనే అవుతోంది. గతేడాది జనవరిలో కనిపించిన రి సోల్‌ జు మళ్లీ ఇప్పుడే దర్శనమిచ్చారు.

ప్యోంగ్యాంగ్‌లో ఏర్పాటు చేసిన మామ జయంతి కార్యక్రమంలో భర్తతో కలిసి హాజరైన రి సోల్‌ జు.. కన్‌సర్ట్‌ను వీక్షించి.. ప్రదర్శనకారులను ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నార్త్‌ కొరియా అధికారిక న్యూస్‌ పేపర్లో ప్రచురితం అయ్యాయి. కింగ్‌ జోంగ్‌ ఇల్‌ జయంతిని ఉత్తర కొరియా ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

దక్షిణ కొరియా నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ సర్వీస్‌ అధికారి ఒకరు రి సోల్‌ జు క్షేమంగానే ఉన్నారని.. తన పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు. కరోనా కాలం కావడంతో పబ్లిక్‌ మీటింగ్‌లకు హాజరు కావడం లేదన్నారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే కిమ్‌ భార్య పబ్లిక్‌గా దర్శనమిచ్చి.. అన్ని అనుమానాలను పటాపంచలు చేశారు.

ఇదిలా ఉంటే, ఉత్తర కొరియా అధ్యక్షులను చైర్మన్ అని పిలుస్తుంటారు. నార్త్ కొరియా దేశానికి మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన కిమ్ సంగ్‌ని మాత్రమే ప్రెసిడెంట్ అని పిలిచేవారు. ఆ తరువాత పనిచేసిన అధ్యక్షులను చైర్మన్ అని పిలిచారు. అయితే, ప్రస్తుత చైర్మన్ కిమ్ జోంగ్ ఉన్‌ను ఆ దేశ మీడియా మొదటిసారి ప్రెసిడెంట్ అని సంభోదించింది. ఇక ఉత్తర కొరియా మీడియా ఏజెన్సీ కూడా ఇదే విధంగా సంభోదించడం విశేషం.

చదవండి: 
ఒక్కసారిగా ఏడ్చేసిన కిమ్‌
నెల రోజులుగా కనిపించని కిమ్‌ సోదరి?!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు