కిమ్‌ కంట కన్నీరు

14 Oct, 2020 04:03 IST|Sakshi

పాలనలో విఫలమయ్యానంటూ ప్రజలకు క్షమాపణలు 

సియోల్‌: నియంతలా వ్యవహరిస్తూ, ఎల్లప్పుడూ ప్రజల్ని తన అదుపాజ్ఞల్లో ఉంచే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కంట కన్నీరు పెట్టుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో విఫలమయ్యానంటూ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. కరోనా సంక్షోభం తెస్తున్న ఒత్తిడి భరించలేకే కిమ్‌ కన్నీరు పెట్టుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తు న్నాయి. ఆయన ఇలా నిస్సహాయంగా అందరి ఎదుట కనిపించడం ఇదే మొదటిసారి. వర్కర్స్‌ పార్టీ 75వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న ఆయన జవాన్లకి ధన్యవాదాలు చెప్పారు. దేశంలో కరోనా వైరస్‌ ముప్పుని తొలగించడంలోనూ, వరద పరిస్థితులు తలెత్తినప్పుడు చేసిన సాయంలోనూ ఆయన సైనికులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కిమ్‌ కంట కన్నీరు పెట్టుకుంటూ జాతిని క్షమాపణ కోరిన వీడియోను అక్కడ మీడియా ప్రసారం చేసింది. 

ఒక్క కేసు నమోదు కాలేదు
దేశంలో ఏ ఒక్కరికీ కరోనా వైరస్‌ సోకకపోవడం చాలా గొప్ప విషయమని కిమ్‌ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌పై పోరాటం, అంతర్జాతీయంగా ఎదుర్కొన్న ఆంక్షలు, దేశాన్ని ముంచెత్తిన పలు తుఫాన్ల కారణంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో తాను విఫలమయ్యానని, తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కిమ్‌ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల నుంచి గట్టెక్కడానికి వారిని దిశానిర్దేశం చేయడంలో తాను పూర్తిగా విఫలమయ్యాయని, తన చిత్తశుద్ధితో చేసిన కృషి సరిపోలేదని అన్నారు. ‘‘ప్రజలు నా మీద ఆకాశమంత నమ్మకాన్ని ఉంచారు. కానీ నేను వారికి సంతృప్తి కలిగించలేక పోయాను’’ దీనికి జాతి యావత్తూ క్షమించాలని కిమ్‌ వేడుకున్నారు. అణుశక్తిని కలిగి ఉన్నందుకు ఇప్పటికే అంతర్జాతీయ సమాజం నుంచి ఆంక్షలు ఎదుర్కొంటు న్నామని, దానికి తోడు కరోనా కారణంగా సరిహద్దుల్ని మూసివేయడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కిమ్‌ వివరించారు. కిమ్‌ భావోద్వేగానికి గురై మాటలు తడబడినప్పుడు ఆయన ప్రసంగం వింటున్న వారు కూడా కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరి మనసుల్ని కలచివేశాయి.   

మరిన్ని వార్తలు