అమెరికా, దక్షిణ కొరియాకు కిమ్‌ సోదరి మాస్‌ వార్నింగ్‌  

8 Mar, 2023 07:43 IST|Sakshi

ఉత్తర కొరియా ఈ పేరు వినగానే ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గుర్తుకు వస్తారు. కిమ్‌ అంటే నియంత పరిపాలన.. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. తాజాగా ఆయన సోదరి కూడా తన అన్నకు తక్కువేమీ కాదని నిరూపించుకున్నారు. తన అన్న బాటలోనే, తాజాగా అగ్రరాజ్యం అమెరికా, దక్షిణ కొరియాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 

అయితే.. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా తప్పు పట్టింది. తమపై దాడికొస్తే గట్టి ప్రతిచర్యలుంటాయని దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ  కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియా కొన్ని నెలలుగా చేస్తున్న విన్యాసాలను మాపై యుద్ధంగానే భావిస్తాం. వారి ప్రతీ అడుగునూ క్షణక్షణం గమనిస్తూనే ఉంటాం. మాకు న్యాయంగా అనిపించే ఏ చర్యనైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె వార్నింగ్‌ ఇచ్చారు.   తమను తక్కువ అంచనా వేయొద్దని, పసిఫిక్ మహాసముద్రంలోకి పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించగలమని సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. 

ఇదిలా ఉండగా.. హ్వాసాంగ్ 17 పేరుతో ప్రయోగించిన ఐసీఎంబీ విజయవంతం కావడంతో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఏ దేశంపైన అయినా సైనిక చర్యకు దిగేలా ప్రేరేపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దేశమైనా తమను ప్రశ్నించినా, బెదిరింపులకు దిగినా అణ్వాయుధాలతోనే సమాధానం ఇస్తామంటూ అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కిమ్‌ హెచ్చరించారు. 
 

మరిన్ని వార్తలు