-

Afghanistan: తాలిబన్ల రాకకు ముందు అఫ్గన్‌ స్త్రీల పరిస్థితి ఇదే!

19 Aug, 2021 17:33 IST|Sakshi

తాలిబన్లు ఆఫ్గనిస్తాన్‌ను 1996 నుంచి 2001 వరకు పరిపాలించారు. షరియా చట్టం ప్రకారం.. చిన్న వయసు నుంచే బాలికలను పాఠశాలలకు వెళ్ళనివ్వరు. మహిళలు ఉద్యమాలు చేయరాదు.  తమ శరీరం కనిపించకుండా తల నుంచి కాళ్ల వరకూ మహిళలు నిండుగా బుర్ఖా ధరించాలి. అయితే తాలిబన్ల పాలనకు పూర్వం అఫ్గాన్‌లో స్త్రీలు ఏ విధమైన జీవనాన్ని గడిపేవారో ఓ సారి తెలుసుకుందాం.

కాబూల్‌: అశ్వకన్, అస్సాకన్‌ అనే పేరు నుంచి అఫ్గాన్‌ అనే పేరు ఉద్భవించింది. ఈ ప్రాంత నైసర్గిక స్వరూప రీత్యా ఇక్కడ అశ్వాలపై సంచారం ఎక్కువగా ఉండేది. ఈ అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కనుక క్రమ క్రమంగా అఫ్గానిస్తాన్‌గా పేరు మారింది. ఇక్కడ పాలించిన వారందరూ తమను అఫ్గాన్లుగానే చెప్పుకున్నారు. ప్రత్యేకించి పష్తో భాష మాట్లాడేవారికి ‘అఫ్గాన్‌’ పదం వర్తిస్తుంది. ఈ భాష ఇక్కడి స్థానిక భాష.


ఉదార, పాశ్చాత్య జీవనశైలి
శతాబ్దాలుగా అంతర్గత సంఘర్షణ, విదేశీ జోక్యంతో విచ్ఛిన్నమైన ఆఫ్గనిస్తాన్ 20వ శతాబ్దం మధ్యలో ఆధునీకరణ వైపు అడుగులు వేసింది. ఆ సమయంలో అఫ్గాన్‌ అనేక తాత్కాలిక చర్యలు తీసుకుంది. 1950,1960లలో సాంప్రదాయ వర్గాల పట్ల గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఆ సమయంలో పెద్దఎత్తున మార్పులతో మరింత ఉదార, పాశ్చాత్య  జీవనశైలి విధానానికి అడుగులు పడ్డాయి.

విద్య, ఓటు వేసే స్వేచ్ఛ
ఆఫ్ఘన్ ప్రభుత్వం బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది. కొత్త విశ్వవిద్యాలయానికి నిధులు సమకూర్చి,  ఓ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. అది ప్రజాస్వామ్య చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆఫ్గన్ మహిళలకు ఓటు హక్కును కల్పించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో మహిళలు కళాశాలకు వెళ్లేందుకు మార్గం పడింది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా నిర్వహించారు. మరి కొంతమంది మహిళలు రాజకీయాల్లో ప్రవేశించారు. దీంతో కాబూల్ కాస్మోపాలిటన్ అయింది.


సంపన్న సమాజం
అఫ్గనిస్తాన్‌ ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో యూఎస్‌, సోవియట్‌ యూనియన్‌తో స్నేహపూర్వకంగా మెలిగింది. సోవియట్‌ యంత్రాలు, ఆయుధాలను.. యూఎస్‌ నుంచి ఆర్థిక సహాయాన్ని అంగీకరించింది. ఆ కాలంలో అఫ్గన్‌కు చాలా ప్రశాంతమైన యుగం. పాత సాంప్రదాయ మట్టి నిర్మాణాలతో పాటు.. కాబూల్‌లో ఆధునిక భవనాల నిర్మాణం జరిగింది. కొంతకాలం పాటు బుర్ఖాలు ధరించడం అనేది ఓ ఆప్షన్‌గా మారింది. దేశం సంపన్న సమాజం వైపు ఓ మార్గంలో వెలుతున్నట్లు కనిపించింది.

అకస్మాత్తుగా అంతా తలకిందులు
దేశంలో తాలిబన్లు పురుడు పోసుకోవడంతో అంతా తలకిందులైనది. 1994లో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 2001లో అమెరికా దాడులు జరిపి పీచమణిచింది. అమెరికా అండతో పౌర ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు దశాబ్దాలు అమెరికా, మిత్రదేశాల రక్షణలో అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం చిగుర్లు వేయడం ఆరంభించింది.  కాగా ఇరవైఏళ్ల తర్వాత అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. వారి ధాటికి తట్టుకోలేక అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ఈ నేపథ్యంలో గతంలో తాలిబన్ల కారణంగా అటు అఫ్గాన్‌లు, ఇటు ఇతర దేశాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తొచ్చి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి.
చదవండి: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం

మరిన్ని వార్తలు