నేపాల్‌ పీఎంగా మళ్లీ ఓలి

15 May, 2021 05:47 IST|Sakshi

కఠ్మాండూ: నేపాల్‌ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలి శుక్రవారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌లో మెజారిటీ కోల్పోయి, విశ్వాసపరీక్షలో విఫలమవడంతో నాలుగు రోజుల కిందటే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే, విపక్ష పార్టీలు మెజారిటీ సాధించే విషయంలో విఫలం కావడంతో గురువారం రాష్ట్రపతి విద్యాదేవి భండారీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేపీ శర్మ ఓలీని కోరారు. దాంతో, రాష్ట్రపతి భవనంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఓలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నెల రోజుల్లోగా ఆయన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే, రాష్ట్రపతి పాలన విధించి, 6 నెలల్లోగా ఎన్నిక లు నిర్వహించే అవకాశముంటుంది. ఓలి గత మంత్రి వర్గాన్నే కొనసాగించనున్నారు.  

ప్రచండ యూ టర్న్‌: సీపీఎన్‌–మావోయిస్ట్‌ సెంటర్‌ చైర్మన్‌ పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ మద్దతుతో మెజారిటీ సాధించి ప్రధాని పదవి చేపడ్తానన్న ఆశతో గురువారం వరకు నేపాలి కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదూ దేవ్‌బా ఉన్నారు. అయితే, చివరి నిమిషంలో ప్రచండ కేపీ శర్మ ఓలీతో సమావేశమై దేవ్‌బాకు మద్దతిచ్చే విషయంలో యూ టర్న్‌ తీసుకున్నారు. 271 మంది సభ్యుల ప్రతినిధుల సభలో ఓలి పార్టీ సీపీఎన్‌–యూఎంఎల్‌కు 121 మంది సభ్యులున్నారు. మెజారిటీకి 136 మంది సభ్యుల మద్దతు అవసరం.  

 

మరిన్ని వార్తలు