భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు: కేపీ శర్మ ఓలి

27 Jan, 2021 15:01 IST|Sakshi

ఖాట్మండు: నేపాల్‌ ప్రధాని(ఆపద్ధర్మ) కేపీ శర్మ ఓలి భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ దేశానికి కరోనా నిరోధక వ్యాక్సిన్‌ను సరఫరా చేసినందుకు గానూ కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ఈ మేరకు.. ‘‘కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ద్వారా మహమ్మారిని కట్టడి మరింతగా కట్టడి చేసే అవకాశం లభించింది. ఇందుకుగానూ మా పొరుగు దేశం భారత్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన వారం రోజుల్లోనే మాకు కూడా వ్యాక్సిన్‌ పంపించారు’’ అని ఓలి ప్రకటన విడుదల చేశారు. కాగా కోవిడ్‌ బారి నుంచి భారత్‌ తనను తాను కాపాడుకుంటూనే పొరుగు దేశాలకు కూడా సాయం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: నేపాల్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు)

ఈ క్రమంలో జనవరి 20 నుంచి పొరుగు దేశాలకు వ్యాక్సిన్‌ పంపించే ప్రక్రియను భారత్‌ ప్రారంభించింది. తొలి రోజు భూటాన్, మాల్దీవులకు వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశారు. రెండో రోజు బాంగ్లాదేశ్, నేపాల్‌లకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ని పంపించారు. ఈ నేపథ్యంలో నేపాల్‌కు మిలియన్‌ కోవిషీల్డ్‌ టీకా డోసులు పంపినందుకు ఓలి ఈ మేరకు స్పందించారు. ఈ దేశాలతో పాటు బ్రెజిల్‌, మయన్మార్, సీషెల్లెన్స్‌లకు భారత్‌ వ్యాక్సిన్‌ను సరఫరా చేసింది. కాగా కరోనా వ్యాపించిన తొలినాళ్లలో భారత్‌ నుంచే తమ దేశానికి మహమ్మారి వ్యాపించిందని ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్‌ విషయంలో ఓలి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో  దౌత్యపరమైన చర్చలకై నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ కుమార్‌ గ్యవాలి ఇటీవల భారత పర్యటనకు వచ్చారు.

మరిన్ని వార్తలు