కుల్‌భూషణ్‌ కేసు: లాయర్‌ను నియమించొచ్చు, కానీ

3 Aug, 2020 18:27 IST|Sakshi

ఇస్లామాబాద్‌: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్‌ నిర్బంధంలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు వ్యతిరేకంగా పాక్‌ ప్రభుత్వం సమర్పించిన పిటిషన్‌ను ఆ దేశ హైకోర్టు సోమవారం విచారించింది. కుల్‌భూషణ్‌ తరఫున న్యాయవాదిని నియమించడానికి కోర్టు అనుమతిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 3కు వాయిదా వేసింది. అంతేగాక పాక్‌ సమర్పించిన రివ్యూ పిటిషన్‌ను ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ గురువారం విచారిస్తుందని కోర్టు తెలిపింది. అనంతరం పాక్‌ అటార్నీ జనరల్‌ ఖలీద్‌ జావేద్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కులభూషణ్‌ తరఫున న్యాయవాదిని నియమించడానికి కోర్టు భారత్‌కు అనుమతినిచ్చింది. (అడుగడుగునా అడ్డుకున్నారు)

కోర్టు రెండు ఆప్షన్స్‌ ఇచ్చింది. మేం కులభూషణ్‌ తరఫున న్యాయవాదిని మార్చవచ్చు. లేదా భారత్‌ అతడి తరఫున ఒక న్యాయవాదిని నియమించడానికి కోర్టు అంగీకారం తెలిపింది. అయితే కేవలం పాక్‌ న్యాయవాదులను మాత్రమే నియమించుకునేందుకు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. మా దేశంలో ప్రాక్టీస్‌ చేయడానికి అర్హత ఉన్నవారిని మాత్రమే కుల్‌భూషణ్‌ తరఫున న్యాయవాదిగా నియమించడానికి కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతానికి భారత న్యాయ ప్రతినిధి ఇంకా ఎవరినీ నియమించలేదు. ఏం జరగనుందో చూడాలి’ అని తెలిపారు. కాగా, కులభూషణ్‌ తరఫున న్యాయవాదిని నియమించాలని కోరుతూ పాక్‌ జూలై 22న ఇస్లామాబాద్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు  భారత ప్రభుత్వంతో సహా ప్రధాన పార్టీలను పాక్‌ సంప్రదించలేదు. 

మరిన్ని వార్తలు