-

హఫీజ్‌ సయీద్‌కు కఠిన కారాగార శిక్ష

25 Dec, 2020 09:11 IST|Sakshi

లాహోర్‌: ముంబై దాడుల్లో మాస్టర్‌ మైండ్, నిషేధిత జమాత్‌ –ఉద్‌–దవా(జుద్‌) చీఫ్, హఫీజ్‌ సయీద్‌కి పాక్‌లోని లాహోర్‌లో ఉన్న యాంటీ టెర్రరిస్టు కోర్టు 15 ఏళ్ల 6నెలల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న నాలుగు నేరాల్లో ఇప్పటికే 70 ఏళ్ళ సయీద్‌కి 21 ఏళ్ళ శిక్ష పడింది. గురువారం సయీద్‌ సహా జమాత్‌–ఉద్‌–దవా ఉగ్రవాద సంస్థ ఐదుగురు నాయకులకు కోర్టు పదిహేనున్నరేళ్ల జైలు శిక్ష విధించిందని కోర్టు అధికారులు తెలిపారు. సయీద్‌కి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునిచ్చి ప్రోత్సహిస్తున్నారన్న ఐదు నేరాల్లో కలిపి మొత్తం 36 ఏళ్ళ జైలు శిక్ష విధించారు.

కాగా, 2008లో ముంబై తాజ్‌ హోటల్‌లో హఫీజ్‌ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్‌ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్‌ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు