ఆకలి రోదనలు.. లక్షల్లో మరణాలు?

7 Jun, 2021 18:41 IST|Sakshi

ఉత్తర కొరియాలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మునుపెన్నడూ లేనంత ఆహార సంక్షోభాన్ని ఆ దేశం చవిచూస్తోంది. కరోనాతో కిందటి ఏడాది తుపాన్లు, వరదలు దేశ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీయగా.. కరోనా కొనసాగింపుతో ఈ యేడు మరింత దుస్థితికి చేరినట్లు తెలుస్తోంది. ఆకలి కేకలతో ఒకవైపు జనాలు అల్లలాడుతుంటే.. మరోవైపు లక్షల్లో మరణాలు నమోదు అయ్యినట్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కొందరు వార్తలు ప్రచురిస్తున్నారు. 

కారణాలు.. 

  • గతేడాది దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ప్రకటించడంతో తగ్గిన ఉత్పత్తి.
  • భారీ వర్షాలు, తుపాన్లు, వరదలతో ఆహార ఉత్పత్తికి నష్టం వాటిల్లడం. 
  • ఇక ముఖ్యమైన కారణం.. ఎగుమతి-దిగుమతులు పూర్తిగా నిలిచిపోవడం. ఉత్తర కొరియా ప్రధానంగా రష్యా, చైనా నుంచి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా చైనా నుంచి 81 శాతం ఉత్పత్తులు వస్తుంటాయి. అలాంటిది కరోనా విజృంభణ మొదలుకాగానే.. ఉత్తర కొరియా కఠినంగా లాక్​డౌన్​ అమలు చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్ని మూసేసి వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయగలిగింది. అయితే ఆకలి కేకల్ని, మరణాల్ని మాత్రం ఆపలేకపోయిందని జీరో ఇషిమారు అనే జర్నలిస్ట్ కథనం ప్రచురించాడు.

లక్షల మరణాలు!
ఉత్తర కొరియాలో ఏం జరిగినా బయటి ప్రపంచానికి తెలియకుండా నియంతాధ్యక్షుడు కిమ్ ​జోంగ్ ఉన్ జాగ్రత్తపడుతుంటాడు. అయితే చైనా సరిహద్దులో సరుకులు అక్రమ రవాణా చేస్తూ బతికేవాళ్లకు అడ్డుకట్ట పడడంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ మేరకు కొందరు ఇండిపెండెంట్ జర్నలిస్టుల విభాగం నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్​తో నార్త్​ కొరియా ప్రజల దీనస్థితి వెలుగు చూసింది. ‘‘సరిహద్దులో ఎంతోమంది అడుక్కుంటున్నారు. కనీస అవసరాలు కూడా లేకుండా బతుకుతున్నారు. వాళ్లలో చాలామంది ఆకలితో చనిపోయిన వాళ్లను గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఆ సంఖ్య వందల నుంచి వేలలో ఉంది. ఇక దేశం లోపల ఆ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని కొందరు యువకులు నాతో చెప్పారు”అని ఇషిమారు అనే జర్నలిస్ట్ తన కథనంలో పేర్కొన్నాడు. ఇక ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. పోయినేడాది 60 శాతం నార్త్ కొరియా ప్రజలు.. ఆకలితో అల్లలాడిపోయారు. ఉన్న నిల్వలు దగ్గర పడడంతో పాటు సెప్టెంబర్ నుంచి ఆ దేశానికి కొత్తగా సరుకులు వెళ్లింది లేదు అని యూఎన్​వో ఒక నివేదికలో వెల్లడించింది.

కిమ్​ వైఫల్యం
నిజానికి కిమ్ పాలనలో ఉత్తర కొరియాలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయని గతంలోనూ రిపోర్టులు వెలువడ్డాయి. అయితే పోయినేడాది కిమ్ జోంగ్ ఉన్ గురించి రకరకాల కథనాలు ప్రచురితం అయ్యాయి. 1990 నాటి దారుణమైన సంక్షోభం రాబోతోందని, కలిసికట్టుగా ఎదుర్కోవాలని జనాలకు పిలుపు ఇచ్చాడు. అయితే ఆ అంచనాలకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు కిమ్​. పైగా ఆహార నిల్వలపై విచిత్రమైన ఆదేశాలిచ్చాడు కూడా.  వాటిలో ఒకటి పెంపుడు కుక్కలను సైన్యం ఆకలి నింపడానికి ప్రభుత్వానికి ఇచ్చేయాలని ప్రజలను ఆదేశించడం. ఈ నిర్ణయంపై జంతు పరిరక్షణ సంఘాలు మండిపడ్డాయి. అయినా కిమ్ ఆ నిర్ణయాన్ని అమలు చేశాడంటే అక్కడి ఆకలి రోదనల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆహారంతో పాటు ప్రజలకు అవసరం అయ్యే మందులు(అత్యవసర చికిత్సకు అవసరమయ్యే మందులతో సహా) కొరత కూడా కొనసాగుతోంది. దీంతో రాయబార కార్యాలయాలు మూతపడడంతో పాటు దౌత్యవేత్తలు, రాయబారులు కొరియా విడిచి స్వస్థలానికి వెళ్లిపోయారు. చివరికి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహార కొరతను తట్టుకోలేక అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాయి.

ఈ పరిస్థితులతో నార్త్​ కొరియా ప్రజలు కిమ్​పై విశ్వాసం పూర్తిగా​ కోల్పోయారని కొన్ని కథనాలు ప్రస్తావించాయి. 70 శాతం ప్రజలకు ఉచిత రేషన్​ హమీతో పాటు 2012 నుంచి ‘ప్రజల స్వేచ్ఛను హరించన’ని వాగ్దానం చేసిన కిమ్​.. తర్వాతి కాలంలో దానిని పూర్తిగా విస్మరించాడని, ఇప్పుడు ఆకలితో జనాలు చస్తున్నా.. వేడుకలు, ఆర్భాటాలకు పోతున్నాడ’ని లియోన్ అనే చైనీస్​ జర్నలిస్ట్​ కథనం రాసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్భాట వేడుకలు, క్షిపణి పరీక్షలు పక్కనపెట్టి..  రష్యా, చైనా సరిహద్దుల్ని తెరవడం, ఐక్యరాజ్య సమితి అందించే తక్షణ సాయాన్ని వద్దనకుండా తీసుకోవడం మాత్రమే కిమ్​ ముందు ఉన్న మార్గాలని సలహా ఇస్తున్నారు నిపుణులు.

చదవండి: ఒక్క కరోనా కేసు లేదు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు