బాల్యంలో నిమోనియా బారిన పడితే... భయంపుట్టిస్తున్న స్టడీ వివరాలు..

9 Mar, 2023 15:41 IST|Sakshi

లండన్‌: బాల్యంలో నిమోనియా వంటివాటి బారిన పడ్డవారికి పెద్దయ్యాక శ్వాసపరమైన ఇన్ఫెక్షన్ల ముప్పు అధికమని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా 26 నుంచి 73 ఏళ్ల మధ్య వయసులో శ్వాస సంబంధిత సమస్యలతో మరణించే ప్రమాదమూ ఎక్కువేనని అది తేల్చింది. ‘‘రెండేళ్లు, అంతకంటే తక్కువ వయసులో బ్రాంకైటిస్, నిమోనియా వంటివాటి బారిన పడేవారిలో పెద్దయ్యాక శ్వాస సంబంధిత వ్యాధులతో అకాల మరణం సంభవించే ఆస్కారం ఇతరులతో పోలిస్తే 93 శాతం ఎక్కువ’’ అని వివరించింది.

దీర్ఘకాలిక శ్వాస సమస్యలు పెద్ద ఆరోగ్య సమస్యగా మారాయి. వీటివల్ల 2017లో ప్రపంచవ్యాప్తంగా 39 లక్షల మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో చాలా మరణాలకు క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీఓపీడీ) కారణమని అధ్యయనం పేర్కొంది. అందుకే శ్వాస సంబంధిత సమస్యలను చిన్నతనంలోనే సంపూర్ణంగా నయం చేయడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉందని అధ్యయనానికి సారథ్యం వహించిన ఇంపీరియల్‌కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు చెందిన జేమ్స్‌ అలిన్సన్‌ అభిప్రాయపడ్డారు. దీని ఫలితాలు ద లాన్సెట్‌ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 

మరిన్ని వార్తలు