శ్మశానాలను తవ్వేసి.. భారీ భవంతులు

11 Jun, 2021 10:33 IST|Sakshi

ఆకాశానంటుతున్న భూముల ధరలు

స్థలాల కొరత వల్ల జపాన్‌లో ఆదరణ పొందుతున్న వృక్ష సమాధులు

శాన్‌మార్కోస్‌ (యూఎస్‌): ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు భూమి విస్తీర్ణం మాత్రం పరిమితం. అందుబాటులో ఉన్న భూమితోనే అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మృతదేహాలను ఖననం చేయడానికి సైతం స్థలం దొరకడం లేదు. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సింగపూర్‌లో పాత శ్మశానాలను తవ్వేసి, భారీ భవంతులు కట్టేస్తున్నారు. కొత్త శ్మశానాలను ఏర్పాటు చేయకపోవడం, స్థలం కొరత వల్ల అంత్యక్రియల విషయంలో ఆచారాలను సైతం మార్చుకోవాల్సి వస్తోంది.

శ్మశానాల కోసం దొరకని స్థలం
అగ్రరాజ్యం అమెరికాలోనూ శ్మశానాల కోసం స్థలం దొరకడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింగపూర్‌లో ప్రభుత్వం శ్మశానాల స్థానంలో కొలంబరియ్స్‌ నెలకొల్పుతోంది. ఒక ఎత్తయిన గోడ లాంటిది కట్టి, మధ్యలో గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మృతుల అస్థికలతో కూడిన కలశాలను ఈ గూళ్లలో ఉంచుతున్నారు. పూర్వీకుల జ్ఞాపకార్థం ఇక్కడే ప్రార్థనలు చేసుకోవాలి. సింగపూర్‌లో ఒక మృతదేహాన్ని 15 ఏళ్ల పాటే శ్మశానంలో ఖననం చేయాలి. తర్వాత వెలికి తీసి, దహనం చేయాలి. అస్థికలను కలశాల్లో భద్రపర్చుకోవచ్చు. అదే స్థలంలో మరో మృతదేహాన్ని ఖననం చేస్తారు.

దహనాలకే ప్రాధాన్యం:
హాంకాంగ్‌లో భూముల విలువ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ స్థలాలు ప్రపంచంలోనే అత్యధిక ధర పలుకుతుంటాయి. శ్మశానాల్లో పార్థివ దేహాల ఖననానికి అవసరమైన స్థలాలను ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. అందుకే హాంకాంగ్‌ ప్రభుత్వం ఖననం కంటే దహనాలకే ప్రాధాన్యం ఇస్తోంది.

గ్రామాలకు తరలిపోదాం:
వృద్ధుల జనాభా పెరిగి, జననాలు తక్కువగా ఉన్న జపాన్‌లో సైతం శ్మశానాల కొరత 1970ల నుంచే మొదలైంది. అందుకే అక్కడి అధికారులు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నారు. నగరంలో ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులు, బంధు మిత్రులు ఒక బస్సులో మృతదేహంతోపాటు యాత్రగా బయలుదేరుతారు. గ్రామానికి దూరంగా తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేస్తారు. జపాన్‌లో 1990ల్లో ‘గ్రేవ్‌–ఫ్రీ ప్రమోషన్‌ సొసైటీ’ అనే సంస్థ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మృతదేహాన్ని దహనం చేసి, బూడిదను భూమిపై వెదజల్లాలని ప్రచారం చేసింది. అయితే, ఈ విధానం ఆదరణ పొందలేదు.

వృక్ష సమాధితో పర్యావరణ పరిరక్షణ
ఉత్తర జపాన్‌లోని షౌన్‌జీ టెంపుల్‌ 1999 నుంచి నవీన ఆవిష్కరణకు తెరతీసింది. అదేమిటంటే.. వృక్ష సమాధి(ట్రీ బరియల్‌). దీన్ని జపాన్‌ భాషలో జుమొకుసో అంటారు. ఇందులో శవాన్ని దహనం చేస్తారు. అస్థికలు, బూడిదను ఒకచోట భూమిలో పాతిపెట్టి, దానిపై మొక్క నాటుతారు. అదే ఆ మనిషి సమాధి. అది వృక్షంగా మారుతుంది. కుటుంబ సభ్యులు ఏటా అక్కడే ప్రార్థనలు చేస్తారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన పద్ధతి అని షౌన్‌జీ టెంపుల్‌ చెబుతోంది. ప్రభుత్వం అనుమతించిన చోట ఒక వృక్ష సమాధి ఏర్పాటయ్యాక క్రమంగా ఇతరులూ అదే తరహా సమాధులు ఏర్పాటు చేసుకుంటున్నారు.

తర్వాతి కాలంలో అదొక పెద్ద వనంగా మారుతోంది. ఇలా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతోందని నిపుణులు అభినందిస్తున్నారు. షౌన్‌జీ టెంపుల్‌కు చెందిన స్థలంలో చిషోయిన్‌ పేరిట వృక్ష సమాధులతో ఒక చిట్టడవి ఏర్పడింది. ఈ శ్మశానంలో కేవలం పెద్దపెద్ద చెట్లే కనిపిస్తాయి. రాళ్లు, సమాధులు గుర్తులు కనిపించవు. మృతుల కుటుంబ సభ్యులు, మత గురువులు ఈ చెట్ల వద్ద ప్రార్థనలు చేస్తారు. సాధారణంగా బౌద్ధులు పర్యావరణ పరిరక్షణను ఆచారంగా పాటిస్తారు. సహజ ప్రకృతి ప్రపంచంలోనే దేవుడుంటాడని నమ్ముతారు. అందుకే ట్రీ బరియల్స్‌కు జపాన్‌లో ఆదరణ పెరుగుతోంది. 

చదవండి: కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం

చదవండి: కోవిడ్‌ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్‌ టాప్‌

మరిన్ని వార్తలు