కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు

16 Dec, 2022 07:45 IST|Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. 50 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కౌలాలంపూర్‌కు సమీపంలోని సెలాంగోర్‌ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌ను క్యాంప్‌ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులు, అధికారులు క్యాంపులో నిద్రపోతున్న సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్‌లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు మరణించారు. 51 మంది ఆచూకీ గల్లంతయ్యారు. 

క్యాంప్‌ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్‌ నరోజమ్‌ ఖామిస్‌ తెలిపారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో క్యాంప్‌పై కొండచరియలు పడినట్లు చెప్పారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

ఇదీ చదవండి: గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జ్‌ పైనుంచి దూకి భారత సంతతి బాలుడు ఆత్మహత్య

>
మరిన్ని వార్తలు