బడుల మూసివేతతో ఒక తరం మొత్తానికి నష్టం!

13 Dec, 2021 03:58 IST|Sakshi

ప్రపంచ బ్యాంకు నివేదిక ఈ నష్టం

ప్రపంచ జీడీపీలో 14%గా అంచనా

న్యూఢిల్లీ: కరోనా కారణంగా బడులు మూసివేతతో ఒక తరం మొత్తం దుర్బలమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. ప్రస్తుత విలువ ప్రకారం లెక్కిస్తే ఒక తరం విద్యార్ధులు బడుల మూసివేతతో 17 లక్షల కోట్ల డాలర్ల జీవితకాల ఆర్జనను నష్టపోతారని అంచనా వేసింది. ఈ మొత్తం ప్రస్తుత ప్రపంచ జీడీపీలో 14 శాతానికి సమానమని తెలిపింది. కరోనా కారణంగా పలు దేశాల్లో విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే. యునెస్కో, యూనిసెఫ్‌తో కలిసి ప్రపంచబ్యాంకు ‘‘స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ క్రైసిస్‌’’ పేరిట ఈ నివేదికను రూపొందించింది. గతంలో అనుకున్నదానికన్నా విద్యాసంస్థల మూసివేతతో వచ్చే నష్టం అధికమని తెలిపింది.

బడుల మూసివేతతో 10 లక్షల కోట్ల డాలర్లు నష్టమని 2020లో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. గతంలో అల్పాదాయ దేశాల్లోని పిల్లల్లో 53 శాతం మంది పేదరికంతో జీవించడాన్ని నేర్చుకునేవారని, స్కూల్స్‌ మూసివేతతో వీరి సంఖ్య 70 శాతానికి చేరనుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో ప్రపంచ విద్యావ్యవస్థలు స్తంభించాయని, కరోనా బయటపడిన 21 నెలల తర్వాత కూడా కోట్లాదిమంది పిల్లల బడులు మూసివేసే ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీరిలో చాలామందికి ఇకపై బడికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేసింది. జ్ఞానార్జనకు పిల్లలు దూరం కావడం నైతికంగా సహించరానిదని, ఒకతరం పిల్లలు పేదరికంలోకి జారడం భవిష్యత్‌ ఉత్పాదకతపై, ఆదాయాలపై పెను ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు ఎడ్యుకేషన్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ జైమె సావెద్రా వివరించారు.  

నిజాలను చూపుతున్న గణాంకాలు
బడుల మూసివేతతో గతంలో చేసిన అంచనాల కన్నా తీవ్ర ఫలితాలున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నట్లు నివేదిక తెలిపింది. గ్రామీణ భారతం, పాకిస్తాన్, బ్రెజిల్, మెక్సికో తదితర ప్రాంతాల్లో పిల్లలు లెక్కలు, చదవడంలో నష్టపోయారని గణాంకాలు వివరిస్తున్నట్లు తెలిపింది.  బడుల మూసివేత ఎంతకాలం కొనసాగింది, విద్యార్థుల సామాజికార్థిక పరిస్థితి, గ్రేడ్‌ లెవల్‌ను బట్టి నష్టాలుంటాయని వివరించింది.  ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో కేవలం 3 శాతం కన్నా తక్కువ మొత్తమే విద్యారంగానికి అందాయని విమర్శించింది.  చాలా దేశాల విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాసుల్లాంటివి చేపట్టినా, వీటి విస్తృతి, నాణ్యత వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది.  అల్పాదాయ దేశాల్లో సుమారు 20 కోట్ల మంది విద్యార్ధులు నూతన విద్యాబోధనా పద్ధతులకు దూరంగా ఉన్నారని పేర్కొంది.

మరిన్ని వార్తలు