ఉగ్రవాదులే పాలకులు..!

9 Sep, 2021 04:51 IST|Sakshi

ఐరాస టెర్రరిజం బ్లాక్‌లిస్టులో 14 మంది తాలిబన్‌ పాలకులు

ఇదే జాబితాలో కొత్త ప్రధానమంత్రి ముల్లా అఖుంద్‌

కాబూల్‌/పెషావర్‌/ఇస్లామాబాద్‌:  అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ఏకంగా 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి వారిని గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ జాబితాలో నూతన ప్రధానమంత్రి ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌తోపాటు ఇద్దరు ఉపప్రధానుల పేర్లు సైతం ఉండడం గమనార్హం. అఫ్గానిస్తాన్‌లోని కొత్త మంత్రివర్గంలో కరడుగట్టిన ఉగ్రవాదులు స్థానం దక్కించుకోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుదీ్దన్‌ హక్కానీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డారు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. సిరాజుదీ్దన్‌ హక్కానీ మామ ఖలీల్‌ హక్కానీ కాందిశీకుల సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. రక్షణ శాఖ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్‌జాయ్‌ తదితరులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన శాంక్షన్స్‌ కమిటీ(తాలిబన్‌ శాంక్షన్స్‌ కమిటీ) గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది.

పాకిస్తాన్‌ ఆర్మీలో కీలక మార్పులు
పాక్‌ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంట భద్రతా పరమైన విభాగాలను పర్యవేక్షిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ అజర్‌ అబ్బాస్‌ను చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌గా నియమించింది. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ తర్వాత రెండో ప్రాధాన్యం ఉన్న పోస్టు చీఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ కావడం గమనార్హం. జనరల్‌ అబ్బాస్‌ బలూచ్‌ రెజిమెంట్‌కు చెందిన వ్యక్తి. ఇప్పటి వరకూ చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్‌ జనరల్‌ షషీర్‌ శంషాద్‌ మీర్జాను రావల్పిండిలోని 10 కార్ప్స్‌ కమాండర్‌గా పంపించారు. ఇంకోవైపు ముల్తాన్‌ కార్ప్స్‌ కమాండర్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ముహమ్మద్‌ ఛిరాగ్‌ హైదర్‌ను నియమించారు.

తాలిబన్లకు చైనా ఆర్థిక సాయం
అఫ్గానిస్తాన్‌కు 3.1 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని చైనా ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాగతించింది. అశాంతిని పోగొట్టి, శాంతిని నెలకొల్పే చర్యగా ప్రభుత్వ ఏర్పాటును అభివర్ణించింది. అఫ్గాన్‌కు ఆహార ధాన్యాలు,  టీకాలు, మందులు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ చెప్పినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్, తజకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రష్యా హాజరు కాలేదు. అఫ్గానిస్తాన్‌ ప్రజలకు తొలి విడతలో 30 లక్షల టీకా డోసులు పంపుతామని వాంగ్‌ భరోసా ఇచ్చారు. చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెంబిన్‌ మాట్లాడుతూ అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నారు. చైనా ఎప్పుడూ అఫ్గానిస్తాన్‌ సార్వ¿ౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని
గౌరవిస్తుందని చెప్పారు.

పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీలకు విలువ లేదు
తాము పూర్తిగా మారిపోయామని, అఫ్గాన్‌ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని నమ్మబలుకుతున్న తాలిబన్లు మరోవైపు తమ అసలు రూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. పవిత్రమైన షరియా చట్టాల ప్రకా రమే అఫ్గానిస్తాన్‌ పరిపాలన, ప్రజా జీవనాన్ని నిర్దేశిస్తామని తాలిబన్‌ అగ్రనేత హైబ తుల్లా అఖుంద్‌జాదా స్పష్టం చేశారు. అఫ్గాన్‌ నూతన ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్‌ మోల్వీ నూరుల్లా మునీర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మా రాయి. ‘‘పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీలకు పెద్దగా విలు వలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తాలిబన్లు, ముల్లాలను చూడండి. వారిలో ఎవరికీ పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీలు కాదు కదా కనీసం ఎంఏ, హైసూ్కల్‌ డిగ్రీలు కూడా లేవు. అయినప్పటికీ వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని మునీర్‌ పేర్కొన్నారు.

ప్రధాని మోదీతో నికొలాయ్‌ పాట్రుశేవ్‌ భేటీ
న్యూఢిల్లీ:  రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్‌కు చేరుకున్న రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికొలాయ్‌ పాట్రుశేవ్‌ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తామిద్దరం కీలకమైన అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు