భారత్‌పై పొగడ్తల ఎఫెక్ట్‌.. ఇమ్రాన్‌ ఖాన్‌పై నవాజ్‌ కూతురి తీవ్ర విమర్శలు

9 Apr, 2022 11:34 IST|Sakshi

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ పొరుగు దేశం భారత్‌ను మరోసారి ఆకాశానికి ఎత్తేసిన వేళ.. ప్రతిపక్ష నేత మరయమ్‌ నవాజ్‌ విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఈ స్థాయిలో కన్నీళ్లు ఏడ్చే వ్యక్తిని చూడడం ఇదే తొలిసారంటూ వ్యాఖ్యానించిన ఆమె.. ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ విడిచి భారత్‌కు వెళ్లిపోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురైన మరయమ్‌ నవాజ్‌ షరీఫ్‌.. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌) ఉపాధ్యక్షురాలు. అంతగా ప్రేమ ఉంటే భారత్‌కి వెళ్లిపోవాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌కు సూచించారామె. ‘అధికారం పోతుందని ఇలా మాట్లాడే వ్యక్తిని చూడడం ఇదే. సొంత పార్టీనే ఆయన్ని ఛీ కొడుతోంది ఇప్పుడు. భారత్‌పై అంత ప్రేమ ఉంటే.. పాక్‌ను వీడి అక్కడికే వెళ్లిపొండి’ అంటూ మరయమ్‌ మండిపడ్డారు. 

ఇమ్రాన్‌ ఖాన్‌ ఖుద్దర్‌ ఖామ్‌(ఆత్మగౌరవం) వ్యాఖ్యలు.. అవిశ్వాసం వేళ ఆయనపై రాజకీయ విమర్శలకు తావిచ్చింది. భారతీయులు ఆత్మగౌరవం ఉన్నవాళ్లని, పాక్‌ ప్రజలు భారత్‌ను చూసి నేర్చుకోవాలని మాట్లాడాడు. రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా.. ఏ మహాశక్తికి లొంగకుండా భారత్‌ పటిష్టంగా ఉందని, పాక్‌ను మాత్రం విదేశీ శక్తులు ఓ టిష్యూ పేపర్‌లా చూస్తున్నాయంటూ వ్యాఖ్యానించాడు.

అయితే.. కశ్మీర్‌ అంశం, ఆరెస్సెస్‌ సిద్ధాంతాల విషయంలో మాత్రం తనకి కొంత అసంతృప్తి ఉందని, బహుశా ఆ కారణం వల్లనే రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు లేకుండా పోయాయంటూ జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు ఇమ్రాన్‌ ఖాన్‌.

చదవండి: భారత్‌ను ఏ మహాశక్తి శాసించలేదు-ఖాన్‌

మరిన్ని వార్తలు