గొడవ పెట్టుకుని.. గోడ కట్టాడు..! 

27 Mar, 2021 18:52 IST|Sakshi

అన్నదమ్ముల పంచాయితీ అంటే ఆషామాషీ కాదు.. ఆస్తి పంపకాల నుంచి మొదలై ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా వస్తుంది. అయితే లెబనాన్‌ లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ..గోడకు దారితీసింది. లెబనాన్‌లోని బీరుట్‌కు దగ్గరగా ఉన్న మనారా అనే పట్టణంలో ఈ గోడ లాంటి ఇల్లు ఉంది. ఇద్దరు అన్నదమ్ముల్లో తమ్ముడికి రావాల్సిన వాటా కన్నా తక్కువ వచ్చిందని అన్నపై కోపం పెంచుకున్నాడు. అన్న ఇంటి నుంచి చూస్తే సముద్రతీరం నేరుగా కనిపిస్తుంది. ఇలా అయితే ఇల్లు ఎక్కువ ధర పలుకుతుంది కదా.. అందుకే తమ్ముడికి ఓ దురాలోచన తట్టింది. అన్న ఇంటి నుంచి బీచ్‌ కనిపించకుండా ఇల్లు కట్టాలని భావించాడు.

ఇలా నిర్మిస్తే ఆ ఇంటి విలువ తగ్గుతుందని మనోడి ఆలోచన. అయితే స్థలం చాలా కొద్దిగా ఉంది. అయినా సన్నగా ఓ ఇల్లు నిర్మించాడు.ఆ ఇంట్లో నివసించేందుకు ఉండాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేశాడు. దీన్ని 1954లో నిర్మించినట్లు చెబుతున్నారు. పైగా ఆ ఇల్లు లెబనాన్‌లో అతి సన్నని ఇంటిగా రికార్డుల్లోకెక్కింది. చాలా సన్నగా ఉన్నవైపు రెండు అడుగుల వెడల్పు, మరోవైపు 14 అడుగుల వెడల్పు ఉందీ ఇల్లు.. ఈ బిల్డింగును అక్కడ ‘విద్వేష’ భవనం అని పిలుస్తారు. 

మరిన్ని వార్తలు